Jammu Kashmir: వైష్ణో దేవి యాత్ర మార్గంలో కొండచరియలు విరిగిపడి 13 మంది మృతి..

జమ్మూకశ్మీర్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ మాతా వైష్ణో దేవి ఆలయానికి వెళ్లే మార్గంలో భారీ కొండచరియలు విరిగిపడటంతో మరణించిన వారి సంఖ్య 30కి చేరింది. అర్థ్‌కువారీ సమీపంలో మంగళవారం ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
జమ్మూకశ్మీర్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలే ఈ ప్రమాదానికి ప్రధాన కారణంగా అధికారులు తెలిపారు. తొలుత ఈ ఘటనలో 9 మంది మరణించినట్లు ప్రకటించినా, సహాయక చర్యలు కొనసాగుతున్న కొద్దీ మృతుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, వైష్ణో దేవి పుణ్యక్షేత్రానికి వెళ్లే రెండు మార్గాలను అధికారులు తక్షణమే మూసివేశారు.
ఈ ఘటనపై శ్రీ మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్ర బోర్డు స్పందించింది. యాత్రికులు తమ ప్రయాణాన్ని ప్రస్తుతానికి వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. వాతావరణ పరిస్థితులు పూర్తిగా చక్కబడిన తర్వాతే యాత్రకు రావాలని భక్తులకు స్పష్టం చేసింది. సమాచారం కోసం ప్రత్యేకంగా ఒక హెల్ప్‌డెస్క్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు బోర్డు అధికారులు తెలియజేశారు.
ఈ దుర్ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన వెంటనే జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో ఫోన్‌లో మాట్లాడారు. సహాయక చర్యల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అన్ని విధాలా అండగా నిలవాలని సూచించారు. జమ్మూకశ్మీర్‌లోనే కాకుండా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తుండటంతో అధికారులు ఆయా ప్రాంతాల్లో హెచ్చరికలు జారీ చేశారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com