Ram Mandir : రెండోరోజూఆలయం ముందు బారులు తీరిన భక్తులు

అయోధ్య రామ మందిరానికి ఇంకా భక్తులు పోటెత్తుతూనే ఉన్నారు.బాలరాముడిని దర్శించుకునేందుకు ఆలయం వద్ద బారులు తీరారు. సోమవారం అయోధ్య రామాలయం గర్భగుడిలో బాల రాముడి విగ్రహానికి పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠ చేశారు. మంగళవారం నుంచి సాధారణ భక్తులకు బాలరాముడి దర్శనానికి అనుమతించారు. రాముడిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు ఆలయం వద్దకు తరలిరావడంతో ఆ ప్రాంతమంతా భక్తజనసంద్రోహంగా మారింది. భక్తులను అదుపుచేసేందుకు పోలీసులకు సవాలుగా మారింది. సుమారు 8వేల మంది పోలీసులను ఆలయం వద్ద అందుబాటులో ఉంచారు. అయినా, భారీగా రాముని దర్శనంకోసం వచ్చిన భక్తులను కట్టడిచేయడంలో పోలీసులు తంటాలు పడ్డారు.
ఆలయం వద్ద పెద్ద క్యూలు దర్శనమిచ్చాయి. కొంత మంది భక్తులు పోలీసు లైన్లను కూడా దాటుకొంటూ వెళ్లారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఆలయం వద్ద తోపులాట జరిగింది. మధ్యాహ్నం 2 గంటల సమయానికి దాదాపు 2.5 లక్షల మంది ఆలయానికి వచ్చారని అయోధ్య డివిజనల్ కమిషనర్ గౌరవ్ దయాల్ తెలిపారు. తొలి రోజు దాదాపు 5 లక్షల మంది బాలక్ రామ్ ని దర్శించుకున్నట్లు అంచనా వేస్తున్నారు.
శ్రీరాముడి దర్శనంకోసం సోమవారం అర్థరాత్రి నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మంగళవారం ఉదయం 6గంటల నుంచి భక్తులను ఆయల కాంప్లెక్సులోనికి అనుమతించారు. అయితే, దర్శనానికి సమయాన్ని రెండు భాగాలు విభజించారు. ఉదయం 7గంటల నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7గంటల వరకు బాలరాముని దర్శనం చేసుకునే అవకాశం కల్పించారు. దీంతో తొలిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు దాదాపు 5లక్షల మంది భక్తులు బాలరాముని దర్శనం చేసుకున్నారు. ఆలయం వద్ద భక్తుల రద్దీ విపరీతంగా ఉండటంతో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హెలికాప్టర్ లో ఎరియల్ సర్వే నిర్వహించారు. ఆలయం వద్ద ఏర్పాట్లను పరిశీలించి, భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులకు సూచనలు చేశారు. భక్తులు భారీ సంఖ్యలో శ్రీరాముడి దర్శనానికి వస్తుండటంతో వృద్ధులు, వికలాంగులు ఆలయ దర్శనాన్ని రెండు వారాల పాటు వాయిదా వేసుకోవాలని సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com