Simultaneous Polls: 2029 నుంచే జమిలి ఎన్నికలు..

Simultaneous Polls: 2029 నుంచే జమిలి ఎన్నికలు..
రాజ్యాంగంలో కొత్తగా చాప్టర్.. లా కమిషన్ ప్రతిపాదనలు

గత కొంత కాలంగా జమిలి ఎన్నికల నిర్వహణపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ నేపధ్యంలో దేశంలో 2029 నుంచి లోక్‌సభతోపాటే అన్ని రాష్ట్రాల శాసనసభలు, స్థానిక సంస్థలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వానికి లా కమిషన్‌ సిఫారసు చేయనున్నట్టు విశ్వసనీయ వర్గాలు గురువారం వెల్లడించాయి. ఈ మేరకు రాజ్యాంగంలో ఒకే దేశం.. ఒకే ఎన్నికలు అనే కొత్త అధ్యాయాన్ని చేర్చేందుకు ప్రతిపాదనలు చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. 2029లో మే, జూన్‌ మధ్య కాలంలో ఎన్నికలు నిర్వహించేలా లా కమిషన్‌ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీని ప్రకారం దేశవ్యాప్తంగా లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు ఏకకాలంలో ఎన్నికలు జరుగుతాయని సంబంధిత వర్గా లు బుధవారం తెలిపాయి.

రాజ్యాంగంలో కొత్తగా చేర్చే చాప్టర్‌లో ఒకే దేశం ఒకే ఎన్నికలు.. వాటి సుస్థిరత, లోక్‌సభ, అసెంబ్లీ, పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికలకు సరిపోయేలా ఉమ్మడి ఓటర్ల జాబితాకు సంబంధించిన అంశాలు ఉండాలని లా కమిషన్ కీలక ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. దేశంలోని అన్ని అసెంబ్లీలకు సంబంధించి ప్రస్తుతం రాజ్యాంగంలో ఉన్న నిబంధనలను భర్తీ చేసేలా కొత్త చాప్టర్‌ను రూపొందించాలని పేర్కొన్నట్లు సమాచారం.

జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా వచ్చే ఐదేళ్లలో రాష్ట్రాల అసెంబ్లీ గడువులను 3 దశల్లో సర్దుబాటు చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. అంటే దేశంలోని కొన్ని రాష్ట్రాల శాసనసభల కాల వ్యవధిని పొడిగించడం.. మరికొన్నింటి రాష్ట్రాల అసెంబ్లీల కాల వ్యవధిని తగ్గించాలని పేర్కొన్నట్లు సమాచారం. ఒకవేళ అవిశ్వాసంతో ప్రభుత్వాలు కూలిపోయినా లేదా హంగ్‌ ప్రభుత్వాలు ఉన్నా.. అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఐక్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కీలక ప్రతిపాదన చేసింది. ఒక వేళ ఈ విధానం పని చేయకపోతే.. అసెంబ్లీ మిగతా కాలానికి కొత్తగా ఎన్నికలు నిర్వహించాలని లా కమిషన్‌ సిఫార్సులు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వ విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.

లా కమిషన్‌తో పాటు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలోని ఒక ఉన్నత స్థాయి కమిటీ కూడా రాజ్యాంగాన్ని, ప్రస్తుత చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌ను మార్చటం ద్వారా జమిలి ఎన్నికలు ఎలా నిర్వహించవచ్చో అనే దానిపై నివేదికను రూపొందిస్తున్నది. ఈ ఏడాది మేలో లోక్‌సభతో పాటు ఐదు అసెంబ్లీలకు ఎన్నికలు జరిగే అవకాశమున్నది. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్‌ రాష్ర్టాల్లో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరుగనున్నాయి. వచ్చే ఏడాది బీహార్‌, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా.. అస్సాం, పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళకు 2026లో, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, మణిపూర్‌లకు 2027లో ఎన్నికలు జరగనున్నాయి. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌, కర్ణాటక, మిజోరం, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, తెలంగాణ రాష్ర్టాల్లో 2028లో ఎన్నికలు జరగవచ్చు. జస్టిస్‌ రీతురాజ్‌ అవస్తీ ఆధ్వర్యంలోని లా కమిషన్‌, ఏకకాల ఎన్నికలపై కొత్త అధ్యాయాన్ని చేర్చటానికి రాజ్యాంగ సవరణకు సిఫారసు చేయవచ్చని సమాచారం.

Tags

Read MoreRead Less
Next Story