Leopard : చిరుత పులి దాడిలో యువతి మృతి

తమిళనాడు రాష్ట్రం వెలూరు జిల్లా కేవీ కుప్పం గ్రామంలో ఒక విషాదకరమైన ఘటన జరిగింది. వంట కట్టెల కోసం అడవిలోకి వెళ్లిన 20 ఏళ్ల అంజలీ అనే యువతి చిరుతపులి దాడికి గురైంది. అంజలీ కట్టెలు తీసుకొని ఇంటి వైపు వస్తుండగా, చిరుతపులి ఆమెపై దాడి చేసి ఆమెను గొంతు పట్టుకొని అడవిలోకి తీసుకెళ్లి హతమార్చింది. ఈ ఘటనపై గ్రామస్థులు ఆందోళన చెందారు. కట్టెల కోసం ఉదయం బయలు దేరిన అమ్మాయి సాయంత్రం వరకు ఇంటికి తిరిగి రాలేదు. దీంతో, గ్రామస్తులు అడవిలో ఆమెను వెతకడం ప్రారంభించారు. గ్రామం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో అంజలీ మృతదేహాన్ని గ్రామస్థులు గుర్తించారు. ఈ విషాద ఘటనతో ఆమె కుటుంబం తీవ్ర శోకంలో మునిగిపోయింది.
విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. దాంతో చిరుతపులిని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు బోన్లు ఏర్పాటు చేశారు. అంజలీ మేల్మొయిల్ గ్రామ పంచాయతీకి చెందినది. ఆ గ్రామంలో మొత్తం 50 కుటుంబాలు నివసిస్తున్నాయి. గ్రామంలో ఈ ఘటనతో తీవ్ర భయాందోళనలు మొదలయ్యాయి. స్థానికులు చిరుతపులి దాడుల కారణంగా చాలా భయాందోళనలో వున్నారు. ఈ సంఘటన గ్రామంలో గందరగోళం రేపింది. అలాగే, అటవీ శాఖ అధికారులు తదుపరి చర్యలు చేపట్టేందుకు సన్నాహాలు చేపడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

