Toll Charge : టోల్ ఛార్జీలకు ఏడాది, లైఫ్‌టైమ్ పాస్‌లు.

జాతీయ రహదారులపై తరచుగా ప్రయాణించే కార్ల యజమానులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పబోతోంది. టోల్ గేట్ల అపరిమిత వినియోగం కోసం ఏడాది, జీవిత కాలపు టోల్ పాస్‌లు అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు సమాచారం. ఏడాది టోల్ పాల్ కోసం రూ. 3 వేలు, జీవిత కాలపు టోల్ పాస్ కోసం రూ.30,000 నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ పాస్‌తో దేశవ్యాప్తంగా ఏ హైవేపైనా ఎన్నిసార్లయినా, ఎటువంటి అదనపు టోల్ చెల్లించకుండా ప్రయాణించవచ్చు.
ప్రస్తుతం అమలులో ఉన్న విధానం
ప్రస్తుతం, హైవేలపై ప్రయాణించే కార్ల యజమానులు ఒక టోల్ ప్లాజాలో ప్రయాణించేందుకు తొమ్మిది నెలల పాస్ రూ.3,060, నెలకు రూ.340 చెల్లించాలి. అయితే, ఈ పాస్‌తో ఒకే టోల్ ప్లాజాలో మాత్రమే ప్రయాణించవచ్చు. అంటే, ఒకటి కన్నా ఎక్కువ టోల్ ప్లాజాలను ఉపయోగించాలంటే, ప్రయాణదారులు సాధారణ టోల్ చార్జీలు చెల్లించాల్సిందే.
కొత్త విధానం ఎలా ఉంటుంది?
కేంద్రం ప్రతిపాదన ప్రకారం, ఒకే సారి రూ.3,000 చెల్లిస్తే ఏడాదిపాటు, రూ.30,000 చెల్లిస్తే 15 ఏళ్ల పాటు దేశవ్యాప్తంగా అన్ని హైవేలపై టోల్ ఫ్రీ ప్రయాణం చేసే అవకాశం లభిస్తుంది. అంటే, ఏదైనా టోల్ ప్లాజాలో నిలిచే అవసరం లేకుండా, అదనపు టోల్ చెల్లించాల్సిన అవసరం లేకుండా హైవే ప్రయాణం మరింత సులభతరం కానుంది.
ఫాస్ట్‌ట్యాగ్‌తోనే కొత్త పాస్‌లు!
ఇప్పటికే దేశంలోని ప్రతి కారుకు ఫాస్ట్‌ట్యాగ్ (FASTag) తప్పనిసరి చేసింది కేంద్రం. దీంతో కొత్తగా పాస్‌లు జారీ చేయాల్సిన అవసరం లేకుండా, ఇప్పటికే ఉన్న ఫాస్ట్‌ట్యాగ్‌లకే లైఫ్‌టైమ్ పాస్‌లను లింక్ చేసే అవకాశం ఉంది. దీని వల్ల టోల్ ప్లాజాల్లో లావాదేవీలు మరింత వేగవంతం అవుతాయి.
ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందంటే?
ప్రస్తుతం ఈ ప్రతిపాదన ప్రాథమిక దశలో ఉంది. త్వరలో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేయనుంది. ఒకసారి అమలులోకి వస్తే, దేశంలోని కోటీ కంటే ఎక్కువ మంది ప్రయాణికులకు దీని వల్ల ప్రయోజనం కలుగనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com