Assam: మారణహోమానికి దారితీసిన లాక్ డౌన్ లవ్ స్టోరీ...

Assam: మారణహోమానికి దారితీసిన లాక్ డౌన్ లవ్ స్టోరీ...
మూడు హత్యాలతో ముగిసిన ప్రేమ కథ

2020లో మొదలైన ఓ లాక్ డౌన్ లవ్ స్టోరీ మూడు భయంకర హత్యలతో క్రైమ్ స్టోరీ గా ముగిసింది. అమ్మాయి ప్రేమ వాళ్ళ అమ్మా నాన్నల హత్యలకు కూడా కారణమైంది. అస్సాంలోని గోలాఘాట్ జిల్లాలో 25 ఏళ్ల నజీబుర్‌ రెహ్మాన్‌, 24 ఏళ్ల సంఘమిత్ర ఘోష్‌ల మధ్య లాక్‌డౌన్ సమయంలో మొదలైన ప్రేమ విషాదాంతమైంది. భార్య,ఆమె తల్లిదండ్రుల హత్యకు కారణమైంది. నిందితుడు తన తొమ్మిది నెలల శిశువుతో పోలీసులకు లొంగిపోయాడు.

వివరాల్లోకి వెళితే..

మెకానికల్ ఇంజినీర్ అయిన నజీబుర్ రెహ్మాన్‌ బోరా, సంఘమిత్ర జూన్ 2020లో లాక్‌డౌన్ సమయంలో ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యారు. నెల రోజుల్లోనే స్నేహం, ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. అదే సంవత్సరం అక్టోబర్‌లో ఇద్దరూ కోల్‌కతాకు పారిపోయారు. కానీ సంఘమిత్ర తల్లిదండ్రులు ఆమెను తిరిగి ఇంటికి తీసుకువచ్చారు. కానీ అప్పటికే ఆమె కోల్‌కతా కోర్టులో నజీబుర్‌ను వివాహం చేసుకుంది. దీంతో కోపం తెచ్చుకున్న సంఘమిత్ర తల్లిదండ్రులు మరుసటి సంవత్సరం మంచి అవకాశం చూసుకుని కుమార్తె పైనే దొంగతనం నేరం మోపుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సంఘమిత్రను అరెస్టు చేసి నెల రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉంచారు. బెయిల్ పొందిన తర్వాత ఆమె తన తల్లిదండ్రుల ఇంటికి తిరిగి వెళ్ళింది. కానీ మళ్ళీ నజీబుర్ ను వదులుకోలేక జనవరి 2022లో పేమ జంట మళ్లీ పారిపోయారు, ఈసారి వారు ఐదు నెలలపాటు చెన్నైలో నివాసం ఉన్నారు. ఆ దంపతులు ఆగస్టులో గోలాఘాట్‌కు తిరిగి వచ్చేసరికి సంఘమిత్ర గర్భవతి. ఇక ఇద్దరూ నజీబుర్ ఇంటిలో నివసించడం ప్రారంభించారు. గత నవంబర్‌లో వారికి ఒక కుమారుడు జన్మించాడు. అయితే, నాలుగు నెలల తర్వాత ఈ ఏడాది మార్చిలో సంఘమిత్ర తన చిన్నారి కొడుకుతో కలిసి నజీబుర్ ఇంటిని వదిలి తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. ఏం జరిగిందో తెలియదు నజీబుర్ తనను చిత్రహింసలకు గురిచేస్తున్నాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.


హత్యాయత్నం కేసు నమోదు చేసి నజీబుర్‌ను అరెస్టు చేశారు. 28 రోజుల తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు. తన కొడుకు తనకి కావాలంటూ సంఘమిత్ర ఇంటికి వెళ్ళాడు. కానీ వారు అతనిని అనుమతించలేదు. దీంతో కోపంతో రగిల్లిపోయిన నజీబుర్ తన భార్య ఆమె తల్లిదండ్రులను కొడవలితో నరికి హత్య చేశాడు తొమ్మిది నెలల బాబుతో పారిపోయాడు. తరువాత పోలీసుల ఎదుట నింగిపోయాడు. నిందితుడి పై హత్య, దాడి తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసామని పోలీసులు చెబుతున్నారు. మొత్తానికి ప్రేమ కథ సుఖాంతంగా ముగియాల్సినది పోయి విషాదాంతమైంది.

Tags

Read MoreRead Less
Next Story