BJP: బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల

‘సంకల్ప పత్రం' పేరిట విడుదల చేసిన ప్రధాని నరేంద్ర మోదీ

లోక్ సభ ఎన్నికల వేళ భారతీయ జనతా పార్టీ మ్యాని ఫెస్టో ను విడుదల చేసింది. ఆదివారం ఉదయం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్ లు పాల్గొని సంకల్ప్ పత్ర పేరుతో మ్యానిఫెస్టోను విడుదల చేశారు. మోదీ గ్యారెంటీ, 2047 నాటికి వికసిత భారత్ నినాదంతో సంకల్ప్ పత్రను విడుదల చేశారు. రానున్న ఐదేళ్లలో బీజేపీ అధికారంలోకి వస్తే చేపట్టే కార్యక్రమాలు, 2047 నాటికి భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు చేయాల్సిన రోడ్ మ్యాప్ అంశాలను మేనిఫెస్టో లో బీజేపీ పొందుపర్చింది. దేశ అభివృద్ధి, సంక్షేమం, దేశ రక్షణ, యువత, మహిళలు, రైతులకు, పేదలకు మేనిఫెస్టో లో బీజేపీ ప్రాధాన్యతను ఇచ్చింది. వేదికపై అంబేద్కర్, రాజ్యాంగాల ప్రతిమలను ఉంచి మేనిఫెస్టోను ప్రకటించారు.

వికసిత్ భారత్‌కు నాలుగు స్తంభాలైన మహిళా శక్తి, యువశక్తి, రైతులు, పేదలపై మేనిఫెస్టో దృష్టి సారించిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ మేనిఫెస్టో జీవితాలకు గౌరవమని, జీవన నాణ్యత అని మోదీ వ్యాఖ్యానించారు. బీజేపీ మేనిఫెస్టో అవకాశాల పరిమాణం, నాణ్యతపై దృష్టి సారిస్తుందని చెప్పారు.

మ్యానిఫెస్టో విడుదల కార్యక్రమంలో జేపీ నడ్డా మాట్లాడుతూ.. ఇవాళ భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి అని, ఆయనకు మా నివాళులర్పిస్తున్నామని చెప్పారు. అంబేద్కర్ సామాజిక న్యాయంకోసం పోరాడారని, ఆయన చూపిన బాటలోనే బీజేపీ కూడా సామాజిక న్యాయంకోసం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో పదేళ్లుగా దేశం అభివృద్ధిలో పరుగులు తీస్తోందని అన్నారు. అయోధ్యలో రామాలయ స్వప్నాన్ని సాకారం చేశాం, ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370ని రద్దు చేశాం. 80కోట్ల మందికి ఉచితంగా రేషన్ ఇస్తున్నామని జేపీ న డ్డా చెప్పారు. లోక్‌సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ మరో వారం రోజుల్లో జరగనున్న నేపథ్యంలో మేనిఫెస్టోని విడుదల చేయడం గమనార్హం.

ఇక గత పదేళ్లలో మోదీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు కొనసాగుతాయని ఆ పార్టీ అగ్రనేత, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ప్రధాని మోదీ నాయకత్వంలో బీజేపీ తమ వాగ్దానాలన్నింటినీ నెరవేర్చుతుందన్నారు. గత పదేళ్లలో మోదీ నాయకత్వంలో దేశప్రజలకు చేసిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చినందుకు తాను సంతోషిస్తున్నానని, చాలా సంతృప్తికరంగా ఉన్నానన్నారు. 2014 సంకల్ప పత్రమైనా, 2019లో ఇచ్చిన హామీలైనా ప్రతి ఒక్కదాన్ని నెరవేర్చామని చెప్పారు. ‘మోదీ కీ గ్యారంటీ’ 24 క్యారెట్ల అంత నాణ్యమైనదని రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు.

Tags

Read MoreRead Less
Next Story