BJP: తమిళనాడు, కేరళలే బిజెపి టార్గెట్

BJP: తమిళనాడు, కేరళలే బిజెపి టార్గెట్
అభ్యుర్ధుల ఎంపిక నుంచే ప్రత్యేక శ్రద్ద

దక్షిణాది రాష్ట్రాల్లో గట్టిగా ఉనికి చాటుకోవాలని భావిస్తున్న భారతీయ జనతాపార్టీ..ఈ సారి తమిళనాడు, కేరళపై భారీ ఆశలే పెట్టుకుంది. తొలివిడతలో ఎన్నికలు పూర్తయిన తమిళనాట కొన్ని సీట్లు గెలుస్తామనే ధీమాతో ఉన్న కమలం పార్టీ కేరళలోనూ ఖాతా తెరవాలని గట్టి ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్‌, లెఫ్ట్‌ పార్టీలకు గట్టి పట్టున్న కేరళలో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతోఅభ్యర్థుల విషయంలో గట్టి కసరత్తే చేసింది. ఈ నేపథ్యంలో కేరళలో ముక్కోణపు పోరు నెలకొన్న కొన్ని స్థానాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

కేరళలోని 20 లోక్‌సభ స్థానాలకు ఒకే విడతలో ఈ నెల 26న పోలింగ్‌ జరగనుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని UDF 19 చోట్ల విజయం సాధించగా...అధికార లెఫ్ట్‌ఫ్రంట్‌ ఒక్కచోట మాత్రమే గెలిచింది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఖాతా తెరవలేకపోయింది. అయితే 15 శాతం ఓట్లు సాధించడంలో సఫలమైంది. ఈసారి ఎలాగైనా కేరళలో ఖాతా తెరవాలని లక్ష్యంగా పెట్టుకుంది.ఈ నేపథ్యంలో కేరళలో కొన్ని స్థానాలను UDF, LDFతోపాటు భాజపా నేతృత్వంలోని NDAకు కూడా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. వాటిలో పాలక్కడ్‌ నియోజకవర్గం ప్రముఖంగా నిలిచింది. 2019ఎన్నికల్లో సీపీఎం ఎంపీ రాజేశ్‌పై కాంగ్రెస్‌ అభ్యర్థి VK శ్రీకందన్‌ గెలిచారు. ఈసారి కూడా కాంగ్రెస్‌ తరఫున ఆయన బరిలో నిలిచారు.LDF తరఫున సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు, కేరళ మంత్రి ఆర్. బిందూ భర్త విజయ రాఘవన్‌ పోటీ చేస్తున్నారు. భాజపా తరఫున సి.కృష్ణకుమార్‌ పోటీకి దిగారు. పాలక్కడ్‌ మున్సిపాలిటీ ఛైర్మన్‌గా భాజపా నాయకురాలు ప్రమీలా శశిధరన్‌ గెలిచారు. ఫలితంగా..మున్సిపాలిటీపై ఉన్న పట్టుతో పాలక్కడ్‌ లోక్‌సభ స్థానంలో జయభేరి మోగించాలని భాజపా భావిస్తోంది.త్రిస్సూర్‌ లోక్‌సభ స్థానంపైనా కమలదళం గట్టి ఆశలే పెట్టుకుంది. సీనియర్‌ నటుడు సురేశ్‌ గోపీ 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినప్పటికీ మరోసారి త్రిస్సూర్‌ బరిలో నిలిపింది. సురేశ్‌ గోపీ కాంగ్రెస్‌ అభ్యర్థి, వడకరా సిట్టింగ్‌ ఎంపీ కె.మురళీధరన్‌ను ఎదుర్కోనున్నారు. మురళీధరన్ దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణాకరన్‌ కుమారుడు. మురళీధరన్‌కు... నాలుగు సార్లు ఎంపీగాను, రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం ఉంది. CPI తరఫున కేరళ మాజీ మంత్రి VS సునీల్‌కుమార్‌ పోటీచేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో 30 శాతానికిపైగా ఉన్న క్రైస్తవులు అభ్యర్థుల గెలుపులో కీలకంగా ఉన్నారు.

Tags

Next Story