India alliance: ఎన్నికల వేళ.. కుదురుకుంటున్న

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ప్రతిపక్ష ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటు చర్చలు జోరందుకున్నాయి. దిల్లీ, గుజరాత్, హరియాణాకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకం పూర్తయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉత్తర్‌ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీతో సీట్ల సర్దుబాటు కొలిక్కి రాగా...మహారాష్ట్రలో మహావికాస్ అఘాదీ కూటమితో చర్చలు తుదిదశకు చేరినట్లు సమాచారం.
ప్రతిపక్ష ఇండియా కూటమి పార్టీలతో కాంగ్రెస్ సీట్ల సర్దుబాటు చర్చలు కొలిక్కి వస్తున్నాయి. బుధవారం యూపీలో సమాజ్‌వాదీపార్టీతో అవగాహన కుదరగా...తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీతోనూ చర్చలు సఫలమైనట్లు తెలుస్తోంది. దిల్లీ, గుజరాత్, హరియాణాలో ఇరుపార్టీలు పోటీచేసే స్థానాలపై ఏకాభిప్రాయం కుదిరినట్లు సమాచారం. దిల్లీలో మొత్తం ఏడు స్థానాలు ఉండగా...ఆప్ నాలుగు లోక్‌సభ స్థానాల్లో, కాంగ్రెస్ 3 నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నాయి. దిల్లీ, దక్షిణ దిల్లీ, పశ్చిమ దిల్లీ, ఉత్తర దిల్లీ లోక్‌సభ స్థానాల్లో కేజ్రీవాల్ పార్టీ, చాందినీ చౌక్, తూర్పు దిల్లీ, ఈశాన్య దిల్లీ పార్లమెంటు నియోజకవర్గాల్లో హస్తం పార్టీ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. హరియాణాలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఒకటి, గుజరాత్‌లో రెండు స్థానాలు ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరించినట్లు తెలుస్తోంది. హరియాణాలో గురుగావ్ లేదా ఫరీదాబాద్ నుంచి, గుజరాత్‌లో భరుచ్, భావ్‌నగర్ లోక్‌సభ స్థానాల్లో ఆప్ పోటీ చేయనుంది.
ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ కాంగ్రెస్-సమాజ్‌వాదీ పార్టీల మధ్య సీట్ల పంపకం ఇప్పటికే కొలిక్కివచ్చింది. అక్కడ మొత్తం 80 లోక్‌సభ స్థానాలు ఉండగా కాంగ్రెస్‌కు 17స్థానాలు ఇచ్చేందుకు అఖిలేష్ యాదవ్ సారథ్యంలోని సమాజ్‌వాదీ పార్టీ అంగీకరించింది. మిగితా స్థానాల్లో ఎస్పీ పోటీ చేయనుంది. ఈ మేరకు ఇరుపార్టీల మధ్య. అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది. ఈ చర్చల్లో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కీలకపాత్ర పోషించినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. యూపీలో సీట్ల సర్దుబాటుపై స్పష్టత వచ్చాకే రాహుల్ యాత్రలో పాల్గొంటాననియ అఖిలేశ్ చెప్పారు.
అటు మహారాష్ట్రలోనూ సీట్ల సర్దుబాటు చర్చలు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. మహా అఘాదీ కూటమిలోని పార్టీలతో చర్చలు తుదిదశకు చేరినట్లు మహారాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ రమేష్ చెన్నితల తెలిపారు. ఈ కూటమిలో శరద్‌చంద్ర పవార్ వర్గానికి చెందిన ఎన్సీపీ, ఉద్ధవ్ బాల్ ఠాక్రే వర్గానికి చెందిన శివసేన, వంచిన్ బహుజన్ అఘాదీ పార్టీలు ఉన్నాయి. ఈనెల 27, 28 తేదీల్లో మిత్రపక్ష పార్టీసలతో సమావేశం తర్వాత అధికారికంగా ప్రకటన చేయనున్నట్లు రమేష్ చెన్నితల తెలిపారు. లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్, మే మాసాల్లో జరిగే అవకాశం ఉంది
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com