Election Commission: 102 లోక్ సభ స్థానాలకు నోటిఫికేషన్, 27 వరకు నామినేషన్లకు అవకాశం

Election Commission:  102 లోక్ సభ స్థానాలకు నోటిఫికేషన్,  27 వరకు నామినేషన్లకు అవకాశం
21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో మొదటి దశ లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

లోక్‌సభ ఎన్నికలు-2024లో భాగంగా ఏప్రిల్ 19న జరగనున్న తొలి దశ పోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రపతి తరపున ఎన్నికల సంఘం ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. నామినేషన్ పత్రాల సమర్పణకు మార్చి 27 చివరి తేదీ వరకు అవకాశం ఉంది. అయితే బీహార్‌లో 27న పండుగ ఉండడంతో 28 వరకు ఎలక్షన్ కమిషన్ అవకాశం కల్పించింది. మార్చి 28 నామినేషన్ పత్రాల పరిశీలన ఉంటుందని, బీహార్‌లో మార్చి 30న పరిశీలన ఉంటుందని వివరించింది. ఇక నామినేషన్ల ఉపసంహరణ గడువు మార్చి 30 అని, బీహార్‌లో ఏప్రిల్ 2 వరకు అవకాశం ఉంటుందని వివరించింది.

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలకు, నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం ఏడు దశల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తిచేసేందుకు షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. తొలి దశలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్ సహా 21 రాష్ట్రాల్లో పోటీచేసే అభ్యర్థులు బుధవారం నుంచి నామినేషన్ వేయనున్నారు.

అత్యధికంగా తమిళనాడులో 39 ఎంపీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనున్నారు. రాజస్థాన్‌లో 12 సీట్లు, ఉత్తరప్రదేశ్‌లో 8, మధ్యప్రదేశ్‌లో 6, అసోం, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో 5 స్థానాల చొప్పున, బీహార్‌లో 4, పశ్చిమ బెంగాల్‌లో 3, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాల్లో 2 సీట్ల చొప్పున, ఛత్తీస్‌గడ్, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అండమాన్ నికోబార్, జమ్మూకశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిల్లో ఒక్కో స్థానానికి పోలింగ్ జరగనుంది. కాగా ఏప్రిల్ 19న మొదటి దశరెండో దశలో ఏప్రిల్ 26న 89 స్థానాలకు పోలింగ్ జరగనుంది. మూడో దశలో మే7న 94 స్థానాలకు , నాలుగో దశలో మే 13న 96 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఐదో దశలో మే 20న 49 స్థానాలకు, 6వ దశలో మే 25న 57 స్థానాలకు , ఏడో దశలో జూన్ 1న 57 స్థానాల్లో పోలింగ్ జరుగనుంది. జూన్ 4న కౌంటింగ్ జరగనుంది.

Tags

Read MoreRead Less
Next Story