Lok Sabha Elections Results 2024: కేంద్రంలో సగం గెలుపు, సగం ఓటమి

లోక్‌సభ ఎన్నికల్లో చెరో సగం సీట్లు సాధించిన కాంగ్రెస్, భాజపాలు పరస్పరం విమర్శలు గుప్పించుకున్నాయి. రిజర్వేషన్ల రద్దు అంటూ కాంగ్రెస్, భారాస చేసిన తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదని కిషన్‌రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా విశ్వాసం కోల్పోయిందని విమర్శించారు. భారాస, భాజపా కుమ్మక్కవ్వడం వల్లే కమలం పార్టీ మెరుగైన సీట్లు సాధించిందని కాంగ్రెస్ ఆరోపించింది. దేశవ్యాప్తంగా వచ్చిన ఫలితాలు మోదీ సర్కార్‌పట్ల వ్యతిరేకతను సూచిస్తోందని వెల్లడించింది. రాష్ట్ర ప్రజల తరపున పోరు కొనసాగిస్తామని భారాస వెల్లడించింది.
సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర ఓటర్లు అనూహ్య తీర్పు ఇచ్చారు. 17 సీట్లలో ఒకటి మజ్లీస్ మినహా చెరో 8సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్, భాజపాలు పరస్పరం విమర్శలు గుప్పించుకున్నాయి. భాజపాపై కాంగ్రెస్ విష ప్రచారం చేసినా ప్రజలు తిప్పికొట్టారని కిషన్‌రెడ్డి వెల్లడించారు. రెఫరెండం అంటూ ఎన్నికలకు వెళ్లిన CM రేవంత్‌రెడ్డి కనీసం 50 శాతం సీట్లు సాధించలేదని..ఇప్పుడు ప్రజలకు ఏం చెబుతారని ప్రశ్నించారు. భారాస పూర్తిగా తుడిచిపెట్టుక పోయిందన్న కిషన్‌రెడ్డి...కాంగ్రెస్ ప్రజా విశ్వాసం కోల్పోయిందని విమర్శించారు. కాంగ్రెస్ ఎన్ని డబ్బులు పంచినా...ఓటర్లు భాజపా వైపే చూశారని చేవెళ్ల MP కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. మెదక్ స్థానంలో హరీశ్‌రావు ఎన్నో కుట్రలు చేసినప్పటికీ..తనని ఆదరించిన ప్రజలకి జీవితాంతం రుణపడి ఉంటానని రఘునందన్ రావు వెల్లడించారు.
మతపరమైన అంశాలు, అయోధ్య అక్షింతలు ఇంటింటికి పంచినప్పటికీ భాజపాను ప్రజలు ఆదరించలేదని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. లోపాయికారిగా భారాస మద్దతు వల్లే రాష్ట్రంలో మంచి ఫలితాలు సాధించారని ఎద్దేవా చేశారు. మైనారిటీ, దళిత, బీసీ వర్గాలు పూర్తిగా కాంగ్రెస్ మద్దతిచ్చారని జహీరాబాద్ MP సురేశ్ షెట్కార్ అన్నారు. ఇప్పటికైనా భాజపా...విద్వేషాలు రెచ్చగొట్టడం మాని...ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని మహబూబాబాద్ MP పోరిక బలరాం నాయక్ తెలిపారు. తన విజయాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి అంకితం ఇస్తున్నట్లు తెలిపారు. అయోధ్యలో రామాలయం నిర్మించిన ఫైజాబాద్ నియోజకవర్గంలోనూ భాజపా ఓడిపోయిందని, వారణాసిలోనూ మోదీ కష్టమ్మీద గెలుపొందారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. కరీంనగర్‌లో కాంగ్రెస్ ఓటమికి...కన్వీనర్‌గా బాధ్యత వహిస్తూ కార్యకర్తలకు క్షమాపణ చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థి MPగా లేకపోయినప్పటికీ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తామని మంత్రి పొన్నం తెలిపారు.
ఓడిపోయినప్పటికీ ప్రజల తరపున పోరాటం ఆపబోమని భారాస కరీంనగర్ అభ్యర్థి వినోద్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో భారాస అధికారంలో లేనందు వల్లే ప్రజలు భారాస మద్దతివ్వలేదని భావిస్తున్నట్లు వెల్లడించారు. నియోజకవర్గ సమస్యలతో పాటు, అభివృద్ధికి పాటు పడతామని గెలిచిన అభ్యర్థులు వెల్లడించారు. తమకు ఓట‌్లేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com