Lok Sabha: సభలో ఎమర్జెన్సీ ప్రస్తావన

Lok Sabha: సభలో ఎమర్జెన్సీ ప్రస్తావన
X
స్వాగతించిన ప్రధాని, కాంగ్రెస్‌ సభ్యుల అభ్యంతరం

లోక్‌సభ స్పీకర్‌గా బుధవారం బాధ్యతలు చేపట్టిన అనంతరం చేసిన ప్రసంగం సందర్భంగా ఎమర్జెన్సీపై ఓం బిర్లా చదివిన తీర్మానం సభలో తీవ్ర దుమారం రేపింది. ప్రధానిగా ఇందిరా గాంధీ విధించిన అత్యయిక స్థితి రాజ్యాంగంపై దాడి అని, 1975, జూన్‌ 25వ తేదీ భారతదేశ చరిత్రలో ఒక చీకటి అధ్యాయం అని ఆయన పేర్కొన్నారు.

ప్రతిపక్ష నేతలను కాంగ్రెస్‌ ప్రభుత్వం జైల్లో వేసిందని, దేశాన్నే ఒక జైలుగా మార్చిందని, మీడియాపై ఆంక్షలు విధించారని, న్యాయ వ్యవస్థ స్వతంత్రను కూడా నియంత్రించారని ఓం బిర్లా పేర్కొన్నారు. ‘ప్రజాస్వామ్య విలువలను ప్రోత్సహించే భారత్‌.. ఇందిరా గాంధీ నియంతృత్వానికి గురైంది. భారత ప్రజాస్వామ్య విలువులను అణచివేశారు. భావ ప్రకటనా స్వేచ్ఛను ఉక్కిరిబిక్కిరి చేశారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఆనాడు పోరాడిన వాళ్ల నిబద్ధతను అభినందిస్తున్నాం’ అని ఓంబిర్లా పేర్కొన్నారు. ఆ రోజుల నాటి బాధితులకు ఈ సభ సంతాపాన్ని తెలియజేస్తుందని ఓంబిర్లా ఈ సందర్భంగా పేర్కొన్నారు.

సభలో స్పీకర్‌ ఎమర్జెన్సీ ప్రస్తావన తేవడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. ఆ సమయంలో రాజ్యాంగ విలువలను అణగదొక్కడాన్ని ఇప్పటి యువతకు తెలియజేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. వ్యవస్థలు ఎలా విధ్వంసమయ్యాయో తెలుసుకోవాలని పేర్కొన్నారు. ఎమర్జెన్సీని నిరసిస్తూ సభలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అడ్డుకోవడంద్వారా కాంగ్రెస్‌ తన ప్రజాస్వామ్య వ్యతిరేకతను బయటపెట్టుకుందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా స్పష్టం చేశారు.

లోక్‌సభలో స్పీకర్‌ ‘ఎమర్జెన్సీ’ అంశాన్ని ప్రస్తావించడంపై కాంగ్రెస్‌ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎమర్జెన్సీ ప్రస్తావనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రతిగా 49 ఏండ్ల క్రితం ఎమర్జెన్సీ విధింపు ద్వారా పౌర హక్కులను కాలరాశారని పేర్కొంటూ పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ , మిత్రపక్షాల ఎంపీలు పార్లమెంట్‌ కాంప్లెక్స్‌లో నిరసన తెలిపారు.సభ వాయిదా అనంతరం భారీ ఎత్తున ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, ప్రహ్లాద్‌ జోషి, కిరణ్‌ రిజిజు, అర్జున్‌ రాం మేఘ్‌వాల్, గజేంద్ర సింగ్‌ శెఖావత్, లలన్‌ సింగ్‌ తదితరులు పాల్గొన్నారు. నాటి పరిస్థితులకు కాంగ్రెస్‌ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Tags

Next Story