Sumalatha: భాజపాలో చేరిన సీనియర్ నటి సుమలత

సార్వత్రిక ఎన్నికలకు ముందు మాండ్య ఎంపీ, సీనియర్ నటి సుమలత భారతీయ జనతా పార్టీలో చేరారు. శుక్రవారం ఉదయం కర్ణాటక రాజధాని బెంగళూరులో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కాగా, తాను బీజేపీలో చేరనున్నట్లు ఇటీవలే సుమలత ప్రకటించిన విషయం తెలిసిందే. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ, జేడీఎస్ దళానికి సపోర్టు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. మాండ్యాను తాను విడిచిపెట్టడం లేదని, రాబోయే రోజుల్లో మీకోసం నేను పనిచేయడం చూస్తారని, బీజేపీలో చేరడానికి డిసైడ్ అయినట్లు సుమలత తెలిపారు. 2019 నాటి ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో కుమారస్వామి కుమారుడు నిఖిల్‌పై సుమలత విజయం సాధించిన విషయం తెలిసిందే.
సీట్ షేరింగ్ ఫార్ములా ప్రకారం.. కర్నాటకలో బీజేపీ 25 స్థానాల్లో పోటీ చేయనున్నది. జేడీఎస్ మూడు చోట్ల పోటీ చేస్తుంది. ఈసారి మాండ్య నుంచి జేడీఎస్ పోటీలో నిలబడనున్నది. తాను స్వతంత్య్ర ఎంపీగా ఉన్నా.. కేంద్రంలోని బీజేపీ సర్కారు మాండ్య లోక్‌సభ నియోజకవర్గానికి 4 వేల కోట్ల నిధుల్ని రిలీజ్ చేసినట్లు సుమలత వెల్లడించారు. బీజేపీకి తన అవసరం ఉందని.. ఆ పార్టీని వదులుకోవద్దని ప్రధాని నరేంద్ర మోదీ తనను కోరారని.. అలాంటి వ్యక్తి చెప్పిన గౌరవించాలి కదా అందుకే బీజేపీలో చేరుతున్నట్లు చెప్పారు. ఇక తనను వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని బీజేపీ ఆఫర్ ఇచ్చిందని.. అయితే ఆ ఆఫర్‌ను తిరస్కరించినట్లు వెల్లడించారు. తాను మాండ్య జిల్లాకు కోడలిని అని.. తాను ఇక్కడే ఉంటానని పేర్కొన్నారు. బీజేపీ నుంచి రాజ్యసభకు సుమలత వెళ్లే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com