PM Modi : టిఎంసి హిందువులను రెండో కేటగిరి పౌరులను చేసేసింది: మోడీ

PM Modi : టిఎంసి హిందువులను రెండో కేటగిరి పౌరులను చేసేసింది: మోడీ
X
కాంగ్రెస్‌ అగ్రనేతలకు ఎన్నికల్లో ఓటమి భయం అంటూ ఎద్దేవా

పశ్చిమ బంగాల్‌లో అవినీతి, బుజ్జగింపు రాజకీయాల్లో మునిగిపోయిన టీఎంసీ ప్రభుత్వం హిందువులను ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చిందని ప్రధాని మోదీ ఆరోపించారు. మహిళలను వేధింపులకు గురిచేసిన సందేశ్‌ఖాలీ కేసులో నిందితులను కాపాడేందుకు మమతా సర్కార్‌ సర్వశక్తులు ఒడ్డినట్లు విమర్శించారు. మరోవైపు కాంగ్రెస్‌ అగ్రనేతలకు ఈ ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకుందని...ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌, వామపక్షాలు...బుజ్జగింపు రాజకీయాలనే నమ్ముకున్నాయని...ప్రధాని మోదీ విమర్శించారు. అందుకే మమతాసర్కార్‌ పౌరసత్వ సవరణ చట్టం అమలును వ్యతిరేకిస్తోందన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బర్ధమాన్‌-దుర్గాపుర్‌, కృష్ణానగర్‌లో జరిగిన ర్యాలీల్లో పాల్గొన్న ప్రధాని మోదీ...అధికార టీఎంసీపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. పశ్చిమబంగాల్లోని టీఎంసీ ప్రభుత్వం హిందువులను ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణిస్తోందన్నారు. టీఎంసీ ఎమ్మెల్యే ఒకరు హిందువులను బహిరంగంగా బెదిరించటమే...అందుకు తార్కాణమన్నారు. ఉత్తర 24 పరగణాలు జిల్లా సందేశ్‌ఖాలీలో అధికార పార్టీ నేతపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చినప్పటికీ...టీఎంసీ సర్కార్‌ బాధితుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించిందని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. బుజ్జగింపు రాజకీయాల కోసం ప్రధాన నిందితుడిని పట్టుకునే ప్రయత్నం చేయలేదన్నారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన నిందితులకు శిక్ష పడాలని దేశమంతా కోరుకున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. కానీ మమతబెనర్జీ సర్కార్‌ చివరివరకు ప్రధాన నిందితుడిని కాపాడేందుకు ప్రయత్నించినట్లు ఆరోపించారు. ప్రతిపక్షాలు దేశాన్ని అభివృద్ధి చేయలేవని, ఓట్లకోసం దేశాన్ని, సమాజాన్ని విభజించటం మాత్రమే చేయగలవని ప్రధాని మోదీ విమర్శించారు.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అగ్రనేతలకు ఇప్పుడు ఓటమి భయం పట్టుకుందని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. అందుకే ఒకరు ప్రత్యక్ష ఎన్నికల బరి నుంచి పూర్తిగా తప్పుకోగా మరొకరు ఓటమి భయంతో రెండో స్థానం నుంచి పోటీకి సిద్ధమయ్యారంటూ...సోనియా, రాహుల్‌ పేర్లు ఎత్తకుండా మోదీ విమర్శించారు.

కృష్ణానగర్‌ తర్వాత బీర్బం ప్రచారసభలో పాల్గొన్న ప్రధాని మోదీ... ఉపాధ్యాయ నియామక కుంభకోణంతో...టీఎంసీ నేతల అసలు రూపం బయటపడిందన్నారు. అవినీతి కుంభకోణాల్లో టీఎంసీ ప్రభుత్వం...రికార్డ్‌ సృష్టించినట్లు ఆరోపించారు. బంగాల్‌ ప్రజలను దోచుకున్న వారిని వదిలిపెట్టబోనన్న ప్రధాని మోదీ...ఇది తన గ్యారంటీ అని హామీ ఇచ్చారు.

Tags

Next Story