LOKSABHA: పక్కా ప్రణాళికతోనే పార్లమెంట్‌లోకి

LOKSABHA: పక్కా ప్రణాళికతోనే పార్లమెంట్‌లోకి
ప్రణాళిక రచించిన ఆరుగురు నిందితులు... అయిదుగురిని అరెస్ట్‌ చేశామన్న పోలీసులు

లోక్‌సభలో భద్రతా వైఫల్యం ఘటనలో సాగర్‌ శర్మ, మనోరంజన్ , నీలమ్‌, అమోల్‌ శిందే, విశాల్‌, లలిత్ అనే ఆరుగురు నిందితులు పక్కా ప్రణాళిక ప్రకారం దుస్సహసానికి పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు. ఈ ఆరుగురు నిందితులకు నాలుగేళ్లుగా ఒకరితో ఒకరికి పరిచయం ఉందన్నారు. పార్లమెంటులో చొరబాటుకు కొన్నిరోజుల క్రితమే వారు ప్రణాళిక రచించారని పోలీసులు చెప్పారు. అందుకోసం సామాజిక మాధ్యమాల్లో నిరంతరం సంప్రదింపులు జరిపినట్లు వివరించారు. ఇప్పటివరకూ ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆరో నిందితుడు లలిత్ కోసం గాలిస్తున్నారు. నిందితుల ఇళ్లకు వెళ్లిన ఆయా రాష్ట్రాల పోలీసులు వారి గురించి ఆరా తీశారు. దొరికిన ఐదుగురిని ఢిల్లీ పోలీసులు వివిధ కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. మణిపుర్ సంక్షోభం, రైతుల నిరసనలు, నిరుద్యోగిత వంటి అంశాలతో నిరాశకు గురై ఈ ఘటనకు పాల్పడినట్టు ఒక నిందితుడు చెప్పినట్లు తెలుస్తోంది. పార్లమెంట్ వద్ద తాజా సంచలన ఘటనలపై దర్యాప్తు చేయడంతో పాటు భవిష్యత్తులో చేపట్టాల్సిన మెరుగైన భద్రతా చర్యలను సిఫార్సు చేసేందుకు లోక్‌సభ సచివాలయం వినతి మేరకు..కేంద్ర హోంశాఖ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. CRPF డీజీ కమిటీకి నేతృత్వం వహిస్తారు. కమిటీలో... ఇతర భద్రతా సంస్థల అధికారులు, నిపుణులు సభ్యులుగా ఉంటారని హోంశాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. వీలైనంత త్వరగా వారు నివేదిక సమర్పిస్తారని తెలిపారు.


బుధవారం మధ్యాహ్నం లోక్‌సభ జీరో అవర్‌లో భాజపా ఎంపీ ఖగేన్‌ ముర్ము మాట్లాడుతున్నప్పుడు...ఇద్దరు ఆగంతుకులు పబ్లిక్‌ గ్యాలరీ నుంచి లోక్‌సభ ఛాంబర్‌లోకి దూకారు. బల్లలపై పరిగెడుతూ వెంట తెచ్చుకున్న గ్యాస్ క్యాన్ల ద్వారా దట్టమైన పొగను సభలో వదిలారు. భయాందోళనకు గురైన ఎంపీలు ఘటన నుంచి తేరుకుని భద్రతా సిబ్బంది సాయంతో వారిని బంధించారు. సభలోకి చొరబడిన దుండగులు నియంతృత్వం నశించాలి, నల్ల చట్టాలను రద్దు చేయాలి, గణతంత్రాన్ని కాపాడాలి అంటూ నినాదాలు చేశారు. అదేసమయంలో పార్లమెంట్ వెలుపల క్యాన్లతో గ్యాస్ వదిలిన మరో ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు.

పార్లమెంట్‌ భవనం చుట్టూ పటిష్ఠమైన భద్రతా వలయం ఉంటుంది. ఎంపీలు మినహా పార్లమెంట్‌కు వచ్చే సిబ్బంది, సందర్శకులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. సందర్శకులు విజిటర్స్‌ గ్యాలరీకి వెళ్లాలంటే మూడంచెల భద్రతా వ్యవస్థను దాటాలి. తొలుత పార్లమెంట్‌ ప్రాంగణంలోని ప్రవేశ ద్వారం వద్ద, రెండోసారి భవనం వద్ద, చివరగా విజిటర్స్‌ గ్యాలరీ వెళ్లే మార్గంలోని కారిడార్‌లో పూర్తిగా తనిఖీ చేస్తారు. పార్లమెంట్‌లో పనిచేసే ప్రతి సెక్యూరిటీ గార్డుకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. వారు తోటమాలి, స్వీపర్లు సహా పార్లమెంట్‌లో పనిచేసే ప్రతి సిబ్బందిని గుర్తించేలా గుర్తింపు కార్డులను జారీ చేస్తారు. పార్లమెంట్‌లో పనిచేసే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నిత్యం ఐడీకార్డులు ధరించాలి. సమయానుసారం సిబ్బందికి సైతం భద్రతా తనిఖీలు చేస్తారు. అదనంగా మెటల్‌ డిటెక్టర్లు, వాహనాల రాకపోకలను నియంత్రించే రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాగ్‌లు, ఫుల్‌ బాడీ స్కానర్ల వంటి అధునాతన పరికరాలతో పార్లమెంట్‌ పరిసరాల్లో భద్రతను ఏర్పాటు చేస్తారు. ఇంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను దాటుకుని పార్లమెంటులో దుండగులు పొగ గొట్టాలతో అలజడి సృష్టించడంతో పార్లమెంటు భద్రత ఏర్పాట్లపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి

Tags

Read MoreRead Less
Next Story