Lok Sabha: టీషర్టులు వేసుకుని లోక్‌సభకు రావొద్దు..: స్పీకర్ ఓం బిర్లా

నియోజవకర్గాల పునర్విభజన ప్రక్రియపై నిరసన వ్యక్తం చేస్తూ టీ-షర్ట్‌లతో సభకు వచ్చిన డీఎంకే సభ్యులపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అసహనం వ్యక్తం చేశారు. అలా రావడం నిబంధనలకు వ్యతిరేకమని స్పష్టం చేశారు. వెంటనే బయటకు వెళ్లి సరైన దుస్తులు ధరించి వచ్చి సభా గౌరవాన్ని కాపాడాలని కోరారు. నియోజక వర్గాల పునర్విభజనపై చర్చ జరపాలన్న డీఎంకే సభ్యులు డిమాండ్‌ను ఆయన తిరస్కరించారు.
నియోజక వర్గాల పునర్విభజనపై కేంద్రంలో ఉన్న బీజేపీ.. తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకేల మధ్య గత కొంత కాలంగా వివాదం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. వీలు దొరికినప్పుడల్లా డీఎంకే నేతలు తమ స్వరాన్ని వినిపిస్తూ.. నియోజక వర్గాల పునర్విభజనను జనాభా ప్రాతిపదికన చేయకూడదని అంటున్నారు. అయితే ఈరోజు లోక్‌సభలో సమావేశాలు ఉండగా.. డీఎంకే సభ్యులు నినాదాలు రాసి ఉన్న టీషర్టులు వేసుకుని పార్లమెంటుకు వచ్చారు.
ముఖ్యంగా పునర్విభజన న్యాయబద్ధంగా జరగాలని.. తమిళనాడు పోరాడుతోంది, తమిళనాడు గెలుస్తోంది అనే నినాదాలు రాసి ఉన్న టీషర్టులను వేసుుకుని వచ్చారు. ముందుగా పార్లమెంట్ బయటే పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. ఆపై లోపలికి వెళ్లి కూడా ఇదే విధంగా తమ మనసులోని భావాలను వెల్లడించారు. అయితే దీనిపై స్పందించిన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నిబంధనలు, విధానాలతో సభలు నిర్వహిస్తారని చెప్పారు.
సభ్యులు హుందాగా గౌరవించి సభ గౌరవాన్ని కాపాడుకోవాలని.. కానీ ప్రతిపక్ష పార్టీలోని కొంత మంది ఎంపీలు ఈ నిబంధనలు పాటించడం లేదని స్పీకర్ ఓం బిర్లా వివరించారు. ఇది సరైన పద్ధతి కాదని.. ఎంత పెద్ద నాయకుడు అయినా సరే సభా గౌరవాన్ని తగ్గించే ఇలాంటి దుస్తులు ధరించడం ఆమోద యోగ్యం కాదన్నారు. ఇకపై ఇలాంటి బట్టలు వేసుకుని పార్లమెంటుకు రాకూడదని వెల్లడించారు. ముఖ్యంగా సభను మధ్యాహ్నానికి వాయిదా వేస్తూ.. సభ్యులు బయటకు వెళ్లి దుస్తు మార్చుకుని రావాలని సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com