LS polls: నోరు మంచిది కాకపోతే బీజేపీ టికెట్‌ కట్‌

LS polls:  నోరు మంచిది కాకపోతే  బీజేపీ టికెట్‌ కట్‌
X
సిట్టింగ్ ఎంపీలైనా, సీనియారిటీ ఉన్నా డోంట్​ కేర్​!

సార్వత్రిక సమరంలో పోటీచేసే అభ్యర్థులకు సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేతలకు భాజపా చెక్‌ పెట్టింది.ఆరుసార్లు లోక్‌సభ సభ్యునిగా పనిచేసిన నేతకు సైతం సీటు ఇచ్చేది లేదని కరాఖండీగా చెప్పేసింది.నోరు పారేసుకుని పార్టీ ఇస్తున్న అవకాశాల్ని కూడా చేజార్చుకోవద్దని పలువురు నేతలకు పరోక్షంగా హెచ్చరికలు పంపింది.

కేంద్రంలో భాజపా సర్కారు పదేళ్ల కాలంలో అనేక మంది నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పార్టీకి ఇబ్బందికర పరిస్థితిని తీసుకొచ్చారు. వారిలో కొంతమందిని ప్రధాని మోదీ నేరుగా హెచ్చరించిన సందర్భాలూ ఉన్నాయి. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేతలకు తాజాగా లోక్‌సభ ఎన్నికల్లో భాజపా టికెట్లు నిరాకరిస్తోంది. ఇందులో కర్ణాటకకు చెందిన కీలక నేత, భాజపా ఎంపీ అనంతకుమార్‌ హెగ్డే ఒకరు. ఉత్తర కన్నడ లోక్‌సభ స్థానంలో తిరుగులేని నేతగా ఉన్న అనంతకుమార్‌ హెగ్డే వరుసగా నాలుగు లోక్‌సభ ఎన్నికల్లో విజయదుందుభి మోగించారు. కానీ అనేక సార్లు ఆయన చేసిన వ్యాఖ్యలు కర్ణాటక సహా దేశవ్యాప్తంగా వివాదాస్పద మయ్యాయి. ఫలితంగా ఈసారి లోక్‌సభ సీటును హెగ్డేకి ఇ‍వ్వలేదు.లోక్‌సభ ఎన్నికల్లో NDA కూటమి 400పైగా స్థానాల్లో విజయం సాధించేందుకు కృషిచేయాలంటూ అభ్యర్ధులకు దిశానిర్దేశం చేసిన భాజపా..నిత్యం ప్రజల్లో ఉంటూ వారికి అండగా నిలవాలని స్పష్టం చేస్తూ వచ్చింది. అయినప్పటికీ కర్ణాటక ఎంపీ అనంతకుమార్‌ హెగ్డే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్‌ రాజ్యాంగాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందని, అది భాజపా మాత్రమే చేయగలుగుతుందన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 400 స్థానాలను గెలుచుకోగలిగితే అది సాధ్యమన్న ఆయన ఆ సంఖ్య పొందాలంటే తమ పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

చివరకు సొంతపార్టీ MPనే రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలు భాజపాకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. హెగ్డే తీరుపై మండిపడిన భాజపా తాజాగా లోక్‌సభ ఎన్నికల్లో ఆయనకు టికెట్‌ నిరాకరించింది. పార్టీకి చెందిన ఆరు సార్లు ఎంపీకే మొండిచేయి చూపడం ద్వారా వివాదాస్పద వ్యాఖ్యలు చేసే నేతలకు...గట్టి హెచ్చరికలు పంపింది. ఉత్తర కన్నడ లోక్‌సభ స్థానంలో ఈ సారి హెగ్డేకి బదులు..... ఆరుసార్లు ఎమ్మెల్యే, కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌గా పని చేసిన విశ్వేశ్వర హెగ్డే కాగేరికి సీటును ఖరారు చేసింది. ఇదే సమయంలో వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండే పలువురు నేతలకు సైతం భాజపా రిక్తహస్తమే చూపింది. అలాంటి వారిలో భోపాల్‌ ఎంపీ ప్రగ్యాసింగ్‌ ఠాకూర్‌, దక్షిణ దిల్లీ భాజపా ఎంపీ రమేశ్ బిధూరి, పశ్చమ దిల్లీ ఎంపీ పర్వేశ్‌ సాహిబ్‌ సింగ్‌ వర్మ కూడా ఉన్నారు.

Tags

Next Story