Wayanad : 9 మంది కుటుంబసభ్యులను కోల్పోయిన శృతి జీవితంలో మరో విషాదం.. కాబోయే భర్త కూడా..

జూలైలో కేరళలోని వాయనాడ్ కొండచరియలు విరిగిపడటంతో తన కుటుంబాన్ని కోల్పోయిన 22 ఏళ్ల శృతి ఇప్పుడు కారు ప్రమాదంలో తన కాబోయే భర్తను కూడా కోల్పోయింది.
శృతి తండ్రి శివన్నన్, తల్లి సబిత డిగ్రీ చదివిన ఆమె సోదరి శ్రేయ కొండచరియలు విరిగిపడటంతో ప్రాణాలు కోల్పోయారు. వారు మాత్రమే కాదు, ఆమె తన తాత, అత్త, మేనమామలతో సహా మొత్తం తొమ్మిది మంది కుటుంబ సభ్యులను జూలై 30 న కోల్పోయింది.
విషాదాల ప్రవాహం
మెప్పాడి పంచాయతీలోని చూరల్‌మల, ముండక్కై గ్రామాలలో 200 మందికి పైగా ప్రాణాలను కొండచరియలు బలిగొన్నాయి. తల్లిదండ్రులు కొత్తగా నిర్మించిన ఇంటితో పాటు దాదాపు రూ. 4 లక్షల నగదు, సుమారు 15 సవర్ల బంగారాన్ని కూడా శృతి కోల్పోయింది. కోజికోడ్‌లోని మిమ్స్ ఆసుపత్రిలో అకౌంటెంట్ గా పని చేస్తున్న శృతి ప్రస్తుతం తన మేనమామ వద్ద నివసిస్తోంది.
శృతికి కాబోయే భర్త జెన్సన్, కల్పేట సమీపంలో కారు ప్రమాదంలో చిక్కుకున్నారు. వీరి వాహనం బస్సును ఢీకొనడంతో ఇద్దరితో పాటు కొందరు బంధువులకు గాయాలయ్యాయి. తలకు బలమైన గాయం కావడంతో జెన్సన్ బుధవారం మరణించినట్లు వార్తా సంస్థ PTI నివేదించింది.
అదే కారులో ప్రయాణిస్తున్న జెన్సన్‌కు చెందిన శృతితో పాటు మరికొందరు కుటుంబ సభ్యులు కూడా ఈ ప్రమాదంలో గాయపడ్డారు.
ఈ నెలలోనే పెళ్లిని ప్లాన్ చేశారు
విషాద సమయాల్లో శృతికి జెన్సన్ అండగా నిలబడ్డాడు. వాళ్లిద్దరిదీ 10 ఏళ్ల పరిచయం. జూన్ 2న వీరి నిశ్చితార్థం కూడా జరిగింది. డిసెంబర్‌లో పెళ్లి పీటలు ఎక్కనున్న ఈ జంట సెప్టెంబర్‌లో సాధారణ కోర్టు రిజిస్టర్డ్ మ్యారేజ్‌ని చేసుకోవాలని అనుకున్నారు. కానీ విధి శృతి జీవితంతో ఆటలాడుకుంది. ఉన్న ఒక్క తోడునీ తీసుకెళ్లిపోయింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com