LPG cylinder: వంట గ్యాస్ సిలిండ‌ర్‌పై రూ.100 త‌గ్గింపు

LPG cylinder: వంట గ్యాస్ సిలిండ‌ర్‌పై రూ.100 త‌గ్గింపు
రాజ‌కీయ ఎత్తుగ‌డ అంటూ మోదీ స‌ర్కార్‌పై భ‌గ్గుమ‌న్న విప‌క్షం

సార్వత్రిక ఎన్నికలకు సమయం సమీపించిన వేళ కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా దినోత్సవం సందర్భంగా వంట గ్యాస్‌ సిలిండర్‌పై 100 రూపాయలు తగ్గిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. కేంద్రం నిర్ణయంతో దిల్లీలో వంట గ్యాస్ ధర 903 రూపాయల నుంచి 803 రూపాయలకు తగ్గింది. ఉజ్వల యోజన లబ్ధిదారులకు 503 రూపాయలకే వంట గ్యాస్‌ సిలిండర్‌ లభించనుంది.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ప్రధాని మోదీ శుభవార్త అందించారు. వంట గ్యాస్ సిలిండర్ ధరను తగ్గిస్తున్నట్టు ప్రధాని మోదీ ‍ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలపై ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గిస్తుందని ముఖ్యంగా నారీశక్తి’కి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వెల్లడించారు. వంట గ్యాస్‌ను అందుబాటు ధరలో అందించటం వల్ల కుటుంబాల శ్రేయస్సుకు మద్దతునిస్తున్నామని మోదీ తెలిపారు. మహిళా సాధికారత, సులభతర జీవన విధానాన్ని అందించడంలో భాగంగానే వంట గ్యాస్‌ సిలిండర్ ధరను 100 రూపాయలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నామని ప్రధాని వెల్లడించారు. గత పదేళ్లలో తమ ప్రభుత్వం సాధించిన విజయాల్లో మహిళల కోసం చేపట్టిన పనులను ఈ నిర్ణయం ప్రతిబింబిస్తోందని మోదీ అన్నారు.

ఆరు నెలల్లో వంటగ్యాస్ ధరలను కేంద్రం తగ్గించడం ఇది రెండోసారి. ఒకదశలో వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర దిల్లీలో 1103 రూపాయలకు చేరగా మధ్యప్రదేశ్, రాజస్థాన్ సహా ఐదు రాష్ట్రాల శాసన సభ ఎన్నికలకు ముందు 200 రూపాయలు తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. తాజాగా వంద రూపాయలు తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దిల్లీలో వంట గ్యాస్ ధర 903 రూపాయల నుంచి... 803 రూపాయలకు తగ్గింది. స్థానిక పన్నులపై ఆధారపడి వివిధ రాష్ట్రాల్లో సిలిండర్‌ ధరల్లో వ్యత్యాసం ఉంటుందని కేంద్రం తెలిపింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద LPG సిలిండర్‌పై అందిస్తున్న 300 రూపాయల రాయితీని వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ కొనసాగించనున్నట్లు.... కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఉజ్వల యోజన లబ్ధిదారులకు, వంట గ్యాస్‌ సిలిండర్‌ 503 రూపాయలకే అందనుంది. ఇతర వినియోగదారులకు 803 రూపాయలకు వంట గ్యాస్‌ సిలిండర్‌ లభిస్తుందని కేంద్రమంత్రి హర్‌దీప్ సింగ్ పూరి వెల్లడించారు. దేశంలో 33 కోట్ల మంది గృహావసరాల వంటగ్యాస్ వినియోగదారులు ఉండగా వారిలో 10 కోట్ల మంది ఉజ్వల యోజన లబ్ధిదారులే.

Tags

Read MoreRead Less
Next Story