LPG Subsidy: సామాన్యుడికి మరో షాక్.. కేవలం వారికి మాత్రమే గ్యాస్ సబ్సిడీ..

LPG Subsidy: సామాన్యులకు మరోసారి షాక్ ఇచ్చింది కేంద్రం. డొమెస్టిక్ సిలిండర్‌పై ఇస్తున్న సబ్సిడీని ఎత్తివేసింది. సబ్సిడీని కేవలం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ పొందిన లబ్ధిదారులకు మాత్రమే పరిమితం చేసింది. సాధారణ ప్రజానీకం ఇకపై మార్కెట్ ధరకే సిలిండర్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని ఆయిల్ సెక్రటరీ పంకజ్ జైన్ స్పష్టం చేశారు.
కరోనా ప్రారంభమైనప్పటి నుంచి LPG వినియోగదారులకు సబ్సిడీ ఇవ్వడం లేదని.. ఇకపై ఉజ్వల పథకం లబ్ధిదారులకు మాత్రమే సబ్సిడీ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో 14.2 కిలోల LPG సిలిండర్ ధర 1003 రూపాయలుగా ఉండగా.. ఉజ్వల పథకం కింద లబ్ధిదారులకు 200 రూపాయలు సబ్సిడీ అందిస్తున్నారు. ఆ మొత్తం ఆయా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ కానుంది. ఈ పథకం కింద ఏడాదికి 12 సిలిండర్లకు 200 చొప్పున సబ్సిడీ లభించనుంది.
సాధారణ గృహ వినియోగదారులు ఇకపై మార్కెట్ ధరకే ఎల్పీజీ సిలిండర్ కొనాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా 30 కోట్ల 5 లక్షల మందికి ఎల్పీజి కనెక్షన్లు ఉండగా.. ఇందులో 9 కోట్ల మంది ఉజ్వల స్కీమ్ లబ్ధిదారులున్నారు. అంటే మిగిలిన 21 కోట్ల మంది సబ్సిడీకి దూరమైనట్లే. 2010లో పెట్రోల్‌పై సబ్సిడీని కేంద్రం ఎత్తివేయగా.. 2014 నవంబర్‌లో డీజిల్ పైనా సబ్సిడీని తొలగించారు. అక్కడికి రెండేళ్లకు కిరోసిన్‌పై ఇస్తున్న సబ్సిడీని నిలిపివేయగా.. తాజాగా గ్యాస్‌కు కూడా కేంద్రం మంగళం పాడేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com