Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌కి రాష్ట్ర హోదా.. కేబినెట్ తీర్మానానికి ఎల్‌జీ ఆమోదం..

Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌కి రాష్ట్ర హోదా.. కేబినెట్ తీర్మానానికి ఎల్‌జీ ఆమోదం..
X
త్వరలోనే ఢిల్లీ పెద్దలతో భేటీ కానున్న సీఎం ఒమర్ అబ్దుల్లా..

జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కేంద్రాన్ని కోరుతూ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మంత్రివర్గం చేసిన తీర్మానాన్ని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా ఆమోదించారు. ఈ అంశాన్ని ప్రధానితో పాటు కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు క్యాబినెట్‌ సమావేశంలో ఓ అంగీకారానికి వచ్చారు. రాష్ట్ర హోదా పునరుద్ధరణకు సంబంధించిన విషయాలపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులతో సమావేశమయ్యేందుకు ముఖ్యమంత్రి త్వరలో దిల్లీ వెళ్లనున్నట్లుగా అధికారులు పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా..మొదటి శాసనసభా సమావేశం నవంబర్‌ 4న జరగనున్నట్లుగా క్యాబినెట్‌ పేర్కొంది. కొత్తగా ఎన్నికైన అసెంబ్లీ సభ్యులతో ప్రమాణం చేయించేందుకు ముబారిక్ గుల్‌ను ప్రొటెం స్పీకర్‌గా నియమించాలని సిఫార్సు చేసింది. శాశ్వత స్పీకర్ ఎన్నికయ్యే వరకూ గుల్‌ను ప్రొటెం స్పీకర్‌గా నియమిస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు.

కేంద్రపాలిత ప్రాంతంగా మారిన జమ్మూకశ్మీర్‌ తొలి ముఖ్యమంత్రిగా నేషనల్‌ కాన్ఫరెన్స్‌(ఎన్‌సీ) నాయకుడు ఒమర్‌ అబ్దుల్లా(54) ప్రమాణం చేశారు. అయితే జమ్మూకశ్మీర్‌ పూర్తిస్థాయి రాష్ట్రంగా ఉన్నప్పుడు 2009 నుంచి 2014 వరకు ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2019లో అధికరణం 370తో పాటు.. జమ్మూకశ్మీర్‌ రాష్ట్రహోదాను కేంద్రం రద్దు చేసిన సంగతి తెలిసిందే.

జమ్మూకశ్మీర్‌ కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తర్వాత తొలిసారి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్‌సీ-కాంగ్రెస్‌ కూటమి విజయం సాధించింది. 90 స్థానాల శాసనసభలో ఎన్‌సీ 42 సీట్లలో, కాంగ్రెస్‌ 6 స్థానాల్లో నెగ్గింది. అబ్దుల్లా కుటుంబం నుంచి సీఎంగా పగ్గాలు చేపట్టిన మూడో వ్యక్తి ఒమర్‌ అబ్దుల్లా. తాత షేక్‌ అబ్దుల్లా, తండ్రి ఫరూక్‌ అబ్దుల్లా కూడా గతంలో సీఎంగా విధులు నిర్వహించారు.

ఇటీవల జమ్మూ కశ్మీర్‌లో జరిగిన ఎన్నికల్లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్‌సీ) విజయం సాధించిన అనంతరం ఒమర్‌ అమర్‌ అబ్దుల్లా మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలనే డిమాండే తొలి క్యాబినెట్‌ తీర్మానమని పేర్కొన్నారు.

Tags

Next Story