Lucknow Crime:16 ఏళ్ల బాలికపై ఐదుగురి దాడి, ముగ్గురు అరెస్ట్‌

Lucknow Crime:16 ఏళ్ల బాలికపై ఐదుగురి దాడి, ముగ్గురు అరెస్ట్‌
X
పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో దారుణ ఘటన చోటుచేసుకుంది. 16 ఏళ్ల బాలికపై ఐదుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో పోలీసులు వేగంగా స్పందించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఒకరిని ఎన్‌కౌంటర్‌ అనంతరం అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల కథనం ప్రకారం బాధితురాలు శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో తన సోదరి ఇంటికి వెళ్లేందుకు ఒక పరిచయస్తుడితో కలిసి మోటార్‌సైకిల్‌పై బయలుదేరింది. మార్గమధ్యలో బంత్రా ప్రాంతంలోని ఓ పెట్రోల్ బంక్ సమీపంలో ఉన్న మామిడి తోట వద్ద వారు ఆగారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న ఐదుగురు వ్యక్తులు, బాలికతో ఉన్న వ్యక్తిని చితకబాది, ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు.

ఈ ఘటనపై బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఈ క్రమంలో గత రాత్రి హరౌనీ రైల్వే స్టేషన్ సమీపంలో తనిఖీలు చేస్తుండగా, బైక్‌పై వస్తున్న ఇద్దరు అనుమానితులను ఆపేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో వారు పోలీసులపై కాల్పులు జరిపారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఒక నిందితుడి కాలికి బుల్లెట్ తగిలింది.

గాయపడిన నిందితుడిని లలిత్ కశ్యప్‌గా గుర్తించామని, అతడిని ఆసుపత్రికి తరలించామని డీసీపీ నిపుణ్ అగర్వాల్ తెలిపారు. గతంలో కూడా లలిత్‌పై జూదం, దొంగతనం కేసులు ఉన్నాయని ఆయన వెల్లడించారు. సంఘటనా స్థలం నుంచి తప్పించుకున్న మరో నిందితుడు, 20 ఏళ్ల మీరజ్‌ను కూడా రైల్వే స్టేషన్ సమీపంలోనే అరెస్ట్ చేసినట్లు డీసీపీ చెప్పారు. నిందితుల నుంచి ఒక బైక్, నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నామని, పరారీలో ఉన్న మిగతా ముగ్గురి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని ఆయన వివరించారు.

మాయావతి తీవ్ర ఆగ్రహం

ఈ దారుణ ఘటనపై బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి తీవ్రంగా స్పందించారు. "రాజధాని లక్నోలో బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం అత్యంత బాధాకరం, సిగ్గుచేటు. యూపీతో సహా దేశంలోని పలు రాష్ట్రాల్లో మహిళలపై అత్యాచారాలు, హత్యలు ఆగడం లేదు. మహిళల భద్రతకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది" అని ఆమె ‘ఎక్స్’లో పేర్కొన్నారు.

Tags

Next Story