DMK MP : గోమూత్ర రాష్ట్రాలన్న డీఎంకే ఎంపీకి స్టాలిన్ వార్నింగ్

బీజేపీ గెలిచిన ఉత్తరాది రాష్ట్రాలను గోమూత్ర రాష్ట్రాలు అంటూ డీఎంకే ఎంపీ సెంథిల్‌కుమార్ మంగళవారం లోక్‌సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ఈరోజు ఆయనప్రకటించారు. ఒకవేళ తన వ్యాఖ్యలు ఎవరి మనోభావాలను దెబ్బతీసినా.. ఆ వ్యాఖ్యలను విత్‌డ్రా చేసుకుంటున్నట్లు సెంథిల్ తెలిపారు. అనాలోచితంగా తాను ఆ వ్యాఖ్యలు చేసినట్లు చెప్పారు. అయితే ఎంపీ సెంథిల్‌కుమార్‌కు సీఎం స్టాలిన్ వార్నింగ్ ఇచ్చినట్లు డీఎంకే ఎంపీ టీఆర్ బాలు తెలిపారు. సెంథిల్ చేసిన వ్యాఖ్యలు సరికాదు అని స్టాలిన్ చెప్పినట్లు బాలు పేర్కొన్నారు. మంగళవారం లోక్‌సభలో జమ్మూకశ్మీర్ బిల్లులపై చర్చ జరిగిన సమయంలో సెంథిల్ మాట్లాడుతూ.. హిందీ భాష మాట్లాడే రాష్ట్రాలను గోమూత్ర రాష్ట్రాలు అంటూ విమర్శించారు. ఆ రాష్ట్రాల్లోనే బీజేపీ విజయం సాధిస్తుంది, కానీ దక్షిణాది రాష్ట్రాల్లో కాషాయ పార్టీకి గెలుపు ఉండదని అన్నారు.
మంగళవారం లోక్‌సభలో డీఎంకే ఎంపీ డీఎన్‌వీ సెంథిల్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హిందీ బెల్ట్‌లోని రాష్ట్రాలను గోమూత్ర రాష్ట్రాలంటూ తీవ్ర వివాదానికి తెరలేపారు. కాగా సెంథిల్ కుమార్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఎదురుదాడికి దిగారు. ఉత్తర భారతీయులపై ఇండియా కూటమి భాగస్వామి చేసిన అవమానకరమైన వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా అని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని ప్రశ్నించారు. జమ్మూ కాశ్మీర్‌కు సంబంధించిన రెండు బిల్లులపై దిగువ సభలో జరిగిన చర్చలో సందర్భంగా.. సెంథిల్ కుమార్ మాట్లాడుతూ, హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో మాత్రమే బీజేపీకి అధికారం ఉందని, ఈ రాష్ట్రాలను సాధారణంగా గోమూత్ర రాష్ట్రాలని పిలుస్తామని, దానిపై ఈ దేశ ప్రజలు ఆలోచించాలని అన్నారు.
సెంథిల్ కుమార్ వ్యాఖ్యలను తమిళనాడు బీజేపీ చీఫ్ కె అన్నామలై ఖండించారు. పార్టీ ఆలోచన చాలా బలహీనంగా మారిందని, డీఎంకే అహంకారమే దాని పతనానికి ప్రధాన కారణం అవుతందని అన్నారు. పుదుచ్చేరిలో ఎన్డీయే కూటమి అధికారంలో ఉందని, కర్ణాటకలో కూడా అధికారంలో ఉందని డీఎంకే ఎంపీలు మరిచిపోయి ఉండవచ్చని అన్నామలై అన్నారు. ఇలాంటి కించపరిచే వ్యాఖ్యలను కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సమర్థిస్తారా అని కర్ణాటక మాజీ మంత్రి సీటీ రవి ప్రశ్నించారు. ఇదిలావుండగా, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా విద్వేషపూరిత ప్రసంగం చేసినందుకు తమిళనాడు రాష్ట్ర మంత్రిపై కేసు నమోదు చేసి, అతనిని పదవి నుండి బర్తరఫ్ చేయాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మంగళవారం డిమాండ్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com