Tejashwi Yadav: నిన్ను రెండుసార్లు ముఖ్యమంత్రిని చేశా.. నితీశ్‌పై తేజస్వి కౌంటర్ ఎటాక్

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కు ప్రతిపక్ష ఆర్జేడీ అగ్రనేత తేజస్వీ యాదవ్ కౌంటర్ ఇచ్చారు. నితీశ్ ను తాను రెండుసార్లు ముఖ్యమంత్రిని చేశానని, చిక్కుల్లో పడ్డ ఆయన పార్టీని ఆదుకున్నానని తేజస్వి చెప్పారు. సీఎం నితీశ్ కుమార్ మంగళవారం అసెంబ్లీలో ప్రసంగిస్తూ లాలూ ప్రసాద్ యాదవ్ ను ముఖ్యమంత్రిని చేసింది తానేనని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై తేజస్వీ యాదవ్ బుధవారం స్పందించారు. నితీశ్ కంటే ముందే లాలూ ప్రసాద్ యాదవ్ రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఓసారి ఎంపీగా సేవ చేశారని చెప్పుకొచ్చారు. ప్రధాన మంత్రులను చేసిన ఘనత లాలూకు ఉందని వివరించారు. లాలూ ప్రసాద్ యాదవ్ సంగతి వదిలేస్తే.. నితీశ్ పార్టీ చిక్కుల్లో పడ్డప్పుడు తానే ఆదుకున్నానని, నితీశ్ ను రెండుసార్లు సీఎం పీఠంపై కూర్చోబెట్టానని తెలిపారు. ఈమేరకు పాట్నాలో జరిగిన ఓ ర్యాలీలో మాట్లాడుతూ తేజస్వి ఈ వ్యాఖ్యలు చేశారు.
2015 అసెంబ్లీ ఎన్నికల్లో మహాఘట్ బంధన్ పేరుతో జేడీయూ, ఆర్జేడీ ఉమ్మడిగా పోటీ చేశాయని తేజస్వి గుర్తుచేశారు. ఆ సమయంలో నితీశ్ పార్టీ జేడీయూకు కేవలం 71 సీట్లు మాత్రమే వచ్చాయని, ఆర్జేడీకి 80 సీట్లు వచ్చినా కూడా నితీశ్ ను సీఎంను చేశామని తెలిపారు. బీజేపీతో తెగదెంపులు చేసుకుని 2022 లో మరోమారు తమతో పొత్తుకు చేతులు కలిపిన నితీశ్ ను మళ్లీ సీఎం పదవిలో కూర్చోబెట్టామని, ఏడాది గడిచిన తర్వాత తమకు హ్యాండిచ్చి మరోమారు బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారని తేజస్వి ఆరోపించారు. తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ గురించి మాట్లాడే ముందు తాను చేసిన సాయాన్ని గుర్తుచేసుకోవాలంటూ నితీశ్ కుమార్ కు తేజస్వి హితవు పలికారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com