ఘోరం: డంపర్ ఢీకొని బస్సులో మంటలు.. 12 మంది సజీవదహనం

మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో బుధవారం రాత్రి డంపర్‌ను ఢీకొనడంతో బస్సులో మంటలు చెలరేగి కనీసం 12 మంది మృతి చెందగా, 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులకు ఆస్సత్రిలో చికిత్స అందిస్తున్నారు. గుణ-ఆరోన్ రహదారిపై ప్రైవేట్ బస్సు డంపర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
గుణ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ యాక్సిడెంట్ గురించి మీడియాకు వివరించారు. ఘటన జరిగిన సమయంలో బస్సులో దాదాపు 30 మంది ప్రయాణికులు ఉన్నారని, వారిలో నలుగురు ఎలాగో బస్సు నుంచి బయటకు వచ్చి ఇంటికి వెళ్లిపోయారని ఎస్పీ తెలిపారు.
" బస్సు ఆరోన్‌కు వెళుతుండగా, డంపర్ గుణ వైపు వెళుతుండగా రాత్రి 9 గంటలకు ప్రమాదం జరిగింది" అని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుపుతోందని గుణ కలెక్టర్ తరుణ్ రాఠీ తెలిపారు.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రమాదంలో మృతి చెందిన వారికి సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 4 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 సహాయం ప్రకటించారు. ప్రమాదంపై ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించారు.
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ సంఘటన బాధాకరమైనదిగా పేర్కొంటూ X లో పోస్ట్ చేశారు. "ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే, కలెక్టర్ మరియు ఎస్పీతో మాట్లాడి, రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించాలని ఆదేశించారు. ప్రయాణికుల మృతికి సంతాపం తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com