Madhya Pradesh: ఐఏఎస్ అధికారిణి పనితీరుకు ప్రశంసలు.. బంగారు పల్లకిలో వీడ్కోలు..

మధ్యప్రదేశ్‌లోని సియోని జిల్లాలో ఐఏఎస్ అధికారి సంస్కృతి జైన్‌కు ఘనంగా వీడ్కోలు పలికారు. భోపాల్‌లో తన కొత్త పోస్టింగ్ కోసం బయలుదేరిన ఆమెను ఆమె సిబ్బంది, సహచరులు బంగారు పల్లకీపై మోసుకెళ్లారు.
సియోని జిల్లా యంత్రాంగం కలెక్టర్ సంస్కృతి జైన్‌కు ఉత్సవ వీడ్కోలు పలికింది. పదవీ విరమణ చేస్తున్న అధికారిణి, ఆమె ఇద్దరు చిన్న కుమార్తెలతో కలిసి, అలంకరించబడిన బంగారు పల్లకీపై కూర్చుని ఉండగా, ఉద్యోగులు ఆమెను హర్షధ్వానాల మధ్య బయటకు తీసుకెళ్లారు.
భోపాల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా నియమితులైన జైన్‌కు వీడ్కోలు పలుకుతూ, సియోని కొత్త కలెక్టర్ శీతల పాట్లేను స్వాగతించడానికి జరిగిన అధికారిక కార్యక్రమంలో భాగంగా ఈ వీడ్కోలు కార్యక్రమం జరిగింది.
వీడ్కోలు వేడుకకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సియోని కలెక్టర్‌గా తన 15 నెలల పదవీకాలంలో, సంస్కృతి జైన్ అనేక ప్రభావవంతమైన కార్యక్రమాలను ప్రారంభించారు. ఆమె లాడ్లీ బెహన్ పథకాన్ని అటల్ పెన్షన్ యోజనతో అనుసంధానించింది. సమాజ భాగస్వామ్య కార్యక్రమాల ద్వారా ప్రాథమిక పాఠశాలలకు డెస్క్‌లు, బెంచీలను అందించడంలో సహాయపడింది. అట్టడుగు వర్గాలను కలుపుకోవడం, ప్రజా సంక్షేమంపై ఆమె దృష్టి సారించినందుకు ఆమె అనేక ప్రశంశలు అందుకుంది.
1989 ఫిబ్రవరి 14న శ్రీనగర్‌లో జన్మించిన జైన్, భారత వైమానిక దళంలో పనిచేసిన కుటుంబం నుండి వచ్చింది. ఆమె తండ్రి ఫైటర్ పైలట్, తల్లి వైద్య విభాగంలో పనిచేశారు. తండ్రి ఉద్యోగ రిత్యా తరచుగా బదిలీలు కావడంతో, ఆమె భారతదేశం అంతటా ఆరు వేర్వేరు పాఠశాలల్లో చదువుకుంది.
బిట్స్ పిలాని (గోవా క్యాంపస్) గ్రాడ్యుయేట్ అయిన జైన్, LAMP ఫెలోషిప్ ద్వారా తన వృత్తి ప్రయాణాన్ని ప్రారంభించి, UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధం కావాలని నిర్ణయించుకుంది. మొదట్లో పిహెచ్‌డి చేయాలని అనుకున్న ఆమె, స్నేహితురాలి సూచన మేరకు పరీక్ష రాసి మొదటి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించింది. ఆమె రెండవ ప్రయత్నంలోనే ఐఆర్‌ఎస్‌లో స్థానం సంపాదించింది. 2014లో అఖిల భారత స్థాయిలో 11వ ర్యాంకుతో తన మూడవ ప్రయత్నంలో ఐఎఎస్‌లో చేరింది.
మధ్యప్రదేశ్ కేడర్‌కు చెందిన 2015 బ్యాచ్ IAS అధికారిణి సంస్కృతి జైన్, రేవా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, సత్నా అదనపు కలెక్టర్, అలీరాజ్‌పూర్ ,నర్మదాపురంలోని జిల్లా పంచాయతీ CEO సహా అనేక కీలక పరిపాలనా పదవులలో పనిచేశారు. ఎక్కడ పని చేసినా నిబద్ధతతో, నిజాయితీతో విధులు నిర్వర్తించేవారు. అక్కడి ప్రజల అభిమానాన్ని సంపాదించుకునేవారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com