Madhya Pradesh Elections: మధ్యప్రదేశ్‌లో విరిసిన కమలం

Madhya Pradesh Elections: మధ్యప్రదేశ్‌లో విరిసిన కమలం
పక్కా ప్లానింగ్ తోనే

మధ్యప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో కమలం సునామీ సృష్టించింది. శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నప్పటికీ భాజపా అధిష్ఠానం తీసుకున్న పలు నిర్ణయాలు, జాగ్రత్తలు ఆ పార్టీకి మరోసారి భారీ విజయాన్ని కట్టబెట్టాయి.

మధ్యప్రదేశ్‌లో మరోసారి భారతీయ జనతా పార్టీకే అధికారం దక్కింది. సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌పై వ్యతిరేకత ఉన్నప్పటికీ భాజపా అధిష్ఠానం తీసుకున్న పలు నిర్ణయాలు ఆ పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించాయి. ప్రచార సమయంలో పలు నియోజకవర్గాల్లో కేంద్ర మంత్రులు, ఎంపీలను భాజపా అధిష్ఠానం రంగంలోకి దించింది. మధ్యప్రదేశ్‌లో మొత్తం 29 లోక్‌సభ స్థానాలుండటంతో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. రాబోయే పార్లమెంట్‌ ఎన్నికలపై ప్రభావం చూపిస్తాయని భావించి.... ప్రత్యేక దృష్టి సారించింది. భాజపా తీసుకున్న ఆ నిర్ణయం పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించింది.

మధ్యప్రదేశ్‌లో నైపుణ్యాభివృద్ధి కావాలంటే కమలం వికసించాలని ప్రధాని మోదీ సహా భాజపా నేతలు చేసిన ప్రచారం అక్కడి యువ ఓటర్లను ప్రభావితం చేసింది. భాజపాలో యువతకు ప్రాధాన్యం లేదని కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణల్ని తిప్పికొట్టిన కమల దళం వారిని ఆకట్టుకునేందుకు స్వయంగా ప్రధాని మోదీనే రంగంలోకి దించడం ఎన్నికల్లో విజయానికి దోహదం చేసింది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా హిందూత్వ అంశం కూడా భాజపాకు కలిసొచ్చింది. మధ్యప్రదేశ్‌లో అధికారంలోకి వస్తే అక్కడి ప్రజలకు అయోధ్య రామ మందిర దర్శనం ఉచితంగా కల్పిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో భాజపా ప్రకటించింది. ఈ హామీని ఆ పార్టీ నాయకులు విస్తృతంగా ప్రచారం చేశారు. మరోవైపు 450 రూపాయలకే గ్యాస్‌ సిలిండర్‌, పేద కుటుంబాలకు చెందిన ఆడపిల్లలకు పీజీ వరకు ఉచిత విద్య వంటి వరాలు ప్రజల్లో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించేందుకు దోహదపడ్డాయి.

ఎన్నికల ముందు ‘లాడ్లీ బెహన్‌ యోజన’ పథకం ద్వారా పేద కుటుంబాల్లోని అర్హులైన మహిళల ఖాతాల్లో నెలకు 1250 రూపాయలు జమ చేస్తామని భాజపా ఇచ్చిన హామీ పనిచేసింది. మరోవైపు ఎన్నికల ముందు పీఎం కిసాన్‌ సాయాన్ని రైతుల ఖాతాల్లోకి బదిలీ చేయడం, గోధుమలు, వరికి కనీస మద్దతు ధర పెంపు, ఉచిత రేషన్‌ మరో ఐదేళ్లపాటు పొడిగించడం వంటి నిర్ణయాలు భాజపా విజయాన్ని ఖాయం చేయడంలో కీలకంగా పనిచేశాయి.మధ్యప్రదేశ్‌లో 35 SC రిజర్వుడు స్థానాలున్నాయి. ఒకప్పుడు బహుజన్‌ సమాజ్‌ పార్టీ-BSPకి మద్దతు పలికిన దళితులు. భాజపావైపే మొగ్గు చూపడం కమలానికి కలిసొచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story