MP Shocker: తప్పు చేశాడు... మూల్యం చెల్లించుకున్నాడు

MP Shocker: తప్పు చేశాడు... మూల్యం చెల్లించుకున్నాడు
X
గిరిజన యువకుడిపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తి ఇల్లు కూల్చివేత... బుల్డోజర్‌తో కూల్చేసిన అధికారులు.. కొనసాగుతున్న రాజకీయ దుమారం...

ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ బుల్‌ డోజర్ విధానాన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా అనుసరించింది. గిరిజన యువకునిపై మూత్ర విసర్జన చేసిన ఓ వ్యక్తి ఇంటిని అధికారులు కూల్చేశారు. గిరిజన యువకుడిపై మూత్ర విసర్జన చేసిన వీడియో మంగళవారం సోషల్ మీడియాలో వైరల్‌ కాగా ప్రభుత్వం స్బందించింది. ఆక్రమణదారులు, గ్యాంగ్‌స్టర్లు, సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినవారి పట్ల యూపీలోని యోగీ సర్కార్‌ కఠినాతికఠినంగా వ్యవహరిస్తూ వారి ఆస్తులను బుల్డోజర్లతో నేలమట్టం చేస్తుంటుంది. ఇప్పుడు శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ సర్కార్‌ కూడా ఇదే పంథా అనుసరిస్తోంది. గిరిజన యువకుడిపై మూత్ర విసర్జన చేసిన ప్రవేశ్‌ శుక్లా ఇంటిని బుల్‌డోజర్‌తో నేలమట్టం చేసింది. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సంబంధిత అధికారులు పోలీసు భద్రత మధ్య ప్రవేశ్‌ శుక్లా నివాసాన్ని కూల్చివేశారు.


ఇల్లు కూలిపోవడం చూసి పర్వేశ్ కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. తమ కుమారుడి నేరానికి సాక్ష్యంగా పోలీసులు ప్రస్తావిస్తున్న వీడియో చాలా పాతదని తల్లి చెప్పారు. ఎన్నికలు సమీపించడంతో రాజకీయ కారణాలతో దీన్ని బయటకు లాగారని ఆరోపించారు. పర్వేశ్ శుక్లా తండ్రి కూడా ఈ వివాదంపై స్పందించారు. తన కుమారుడు ఇలాంటి పనిచేసేందుకు ఛాన్సే లేదని అతడిపై ఏదో కుట్ర జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మూత్ర విసర్జన వీడియో చూసి తామంతా చాలా ఒత్తిడికి లోనయ్యామని వివరించారు.

మధ్యప్రదేశ్‌లో ఆదివాసి యువకుడిపై మూత్ర విసర్జన చేసిన ఘటనపై రాజకీయ దుమారం రేగింది. ఇది తీవ్ర వివాదాస్పదం కావడంతో పోలీసులు శరవేగంగా గాలింపు చర్యలు చేపట్టారు. సాంకేతికత సాయంతో నిందితుడు ప్రవేశ్‌ శుక్లాను ట్రాక్‌ చేసి తెల్లవారుజామున అరెస్టు చేశారు. అతడిపై జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేశారు. సీధీ జిల్లాలో 3నెలలక్రితం జరిగిన ఈ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో ఇటీవల వైరల్‌ కావడంతో మధ్యప్రదేశ్‌లో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. దీంతో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌ సింగ్ చౌహన్‌ స్పందించి....నిందితుడిని అరెస్టు చేసి జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.

నిందితుడు ప్రవేశ్‌ శుక్లాకు భాజపాతో సంబంధం ఉందని హస్తం పార్టీ ఆరోపించగా కమలనాథులు తీవ్రంగా ఖండించారు. నిందితుడు తమ పార్టీ సభ్యుడు ఎంత మాత్రం కాదన్నారు. నిందితుడు పాల్పడిన ఘటన అమానవీయమని మధ్యప్రదేశ్‌ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా అన్నారు. ఇలాంటివారికి సాధారణ శిక్ష సరిపోదని చెప్పారు.

Tags

Next Story