Madras High Court:తిరుపరంకుండ్రం కొండపై దీపం వెలిగించేందుకు కోర్టు అనుమతి

Madras High Court:తిరుపరంకుండ్రం కొండపై  దీపం వెలిగించేందుకు కోర్టు అనుమతి
X
స్టాలిన్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ

తమిళనాడులోని తిరుపరంకుండ్రం కొండపై దీపం వెలిగింపుపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆలయ దేవస్థానం తప్పనిసరిగా దీపం వెలిగించాలని న్యాయస్థానం ఆదేశించింది. ప్రజా సమూహం లేకుండా ఆచారాన్ని నియంత్రిత పద్ధతిలో నిర్వహించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. జస్టిస్ జి జయచంద్రన్, జస్టిస్ కెకె రామకృష్ణన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ తీర్పును వెలువరించింది. దీంతో తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

తిరుపరంకుండ్రం కొండ తమిళనాడులోని మధురైకి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పురాతనమైన పవిత్రకొండ. కొండపై సుబ్రమణ్యస్వామి ఆలయం చెక్కబడింది. దీన్ని భారత ప్రభుత్వం రక్షిత స్మారక చిహ్నంగా గుర్తించింది. అయితే ఈ కొండపై ఇతర మతపరమైన కట్టడాలు కూడా ఉన్నాయి. దర్గా (మసీదు), జైన అవశేషాలు ఉన్నాయి. అయితే కొన్నేళ్లుగా వివాదాలు నడుస్తున్నాయి. ఈ మధ్య తీవ్రమయ్యాయి.

అయితే కొండపై దర్గా ఉన్న కారణాన హిందూ మతపరమైన ఆచారంలో భక్తులకు దీపం వెలిగించే హక్కు ఉందా? అనే అంశంపై మత సంస్థలు, తమిళనాడు ప్రభుత్వం న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉంటుందని స్టాలిన్ ప్రభుత్వం పేర్కొంది.

మంగళవారం విచారించిన ధర్మాసనం.. రిట్ అప్పీలుపై తీర్పును వెలువరిస్తూ.. కొండపై దీపం వెలిగించడానికి ఆలయ దేవస్థానానికి అనుమతి ఇచ్చింది. నిర్వహించే హక్కు ఉందని తీర్పునిచ్చింది. ఈ మేరకు మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ పేర్కొంది. కోర్టు ఆదేశాలను పాటించేలా.. ఆచార నిర్వహణ సమయంలో క్రమశిక్షణను కాపాడటానికి జిల్లా కలెక్టర్ ఈ కార్యక్రమాన్ని వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని ఆదేశించింది. మొత్తానికి దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదానికి ధర్మాసనం ముగింపు పలికింది. ఏడాదిలో ఒక రోజు దీపం వెలిగించినంత మాత్రాన శాంతి భద్రతల సమస్య తలెత్తదని అభిప్రాయపడింది. అలాగే దీపం వెలిగించొద్దని శాస్త్రాల్లో లేదనేందుకు తగిన ఆధారాల్ని కోర్టుకు సమర్పించలేదని తెలిపింది. ఈ విషయంలో ప్రభుత్వ రాజకీయ దురుద్దేశం కనిపిస్తోందని కోర్టు అభిప్రాయపడింది. ఒకవేళ ఇక్కడ ఇబ్బంది కలిగితే.. అది ప్రభుత్వమే చేయించడానికి అవకాశం ఉందని, ప్రభుత్వం అలా దిగజారబోదని భావిస్తున్నట్లు తెలిపింది. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఆ రాతి స్తంభంపై దీపం వెలిగించేందుకు అనుమతించింది. గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సమర్ధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై తమిళనాడు బీజేపీ నేత అన్నామలై హర్షం వ్యక్తం చేశారు.

Tags

Next Story