Madras High Court: భర్త మరణానంతరం పునర్వివాహం చేసుకున్న భార్యకు ఆస్తిలో వాటా

భర్త మరణానంతరం పునర్వివాహం చేసుకునే భార్యకు హిందూ వివాహ చట్టం ప్రకారం ఆయన ఆస్తిలో వాటా పొందేందుకు హక్కు ఉంటుందని మద్రాసు హైకోర్టు తీర్పునిచ్చింది. తమిళనాడులోని సేలంకు చెందిన సేవి గౌండర్ మృతి తర్వాత ఆయన వారసులైన చిన్నయ్యన్, ఆయన సోదరులకు ఆస్తులు బదిలీ అయ్యాయి. చిన్నయ్యన్ మృతి చెందాక ఆయన భార్య మల్లిక రెండో పెళ్లి చేసుకున్నారు. చనిపోయిన మొదటి భర్త ఆస్తుల్లో వాటా ఇవ్వాలని ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను సేలం సివిల్ కోర్టు కొట్టివేసింది.
అనంతరం ఆమె మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ఇది జస్టిస్ సుబ్రమణియన్, జస్టిస్ కుమరప్పన్ ధర్మాసనం వద్ద బుధవారం విచారణకు వచ్చింది. హిందూ వివాహ చట్టం 1955 ప్రకారం మొదటి భర్త ఆస్తిలో వాటా అడిగేందుకు భార్యకు హక్కు ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తులు.. భర్తను కోల్పోయిన మహిళకు ఆస్తిలో వాటా లేదని హిందూ వివాహ చట్టం చెప్పలేదని తెలిపారు. పునర్వివాహం చేసుకున్న మహిళకు హక్కు లేదన్న హిందూ వివాహ చట్టం సెక్షన్‌ను 2005లోనే రద్దు చేశారని పేర్కొన్నారు. ఆమెకు దక్కాల్సిన ఆస్తులను అప్పగించాలని ఉత్తర్వులిచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com