Maha Kumbh mela: ప్రయాగ్ రాజ్‌లో మహా కుంభమేళా ప్రారంభం..

Maha Kumbh mela: ప్రయాగ్ రాజ్‌లో మహా కుంభమేళా ప్రారంభం..
X
నేటి నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటూ

గంగా, యమునా, సరస్వతి నదుల త్రివేణి సంగమం ప్రయాగ్ రాజ్.. మహా కుంభ మేళాకు రెడీ అయింది. నేటి (జనవరి 13) నుంచి ఈ ఆధ్యాత్మిక ఉత్సవం ప్రారంభం అయింది. పుష్య పౌర్ణమి స్నానంతో ప్రారంభమయ్యే ఈ మహా కుంభ్.. సుమారు 45 రోజుల పాటు జరగనుంది. రాజ స్నానాలు ఆచరించేందుకు ఇప్పటికే లక్షలాది మంది భక్తులు ప్రయాగ్ రాజ్ కు తరలి వచ్చారు. ఈ మహా కుంభమేళాకు 35 కోట్ల మంది భక్తులు తరలివచ్చే ఛాన్స్ ఉందని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేసింది.

ఇక, మహా కుంభమేళాను ప్రశాంతంగా, భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండేలా ఉత్తర్‌ ప్రదేశ్‌ సర్కార్ భారీగా ఏర్పాట్లు చేసింది. భద్రతతో పాటు సౌకర్యాల కోసం సాంకేతిక సహకారాన్ని విస్తృతంగా ఉపయోగిస్తుంది. కృత్రిమ మేధ సహకారంతో దీనిని డిజిటల్‌ కుంభమేళాగా మార్చింది. 10,000 ఎకరాల్లో కుంభమేళాకు ఏర్పాట్లు చేశామని.. 50 లక్షల మంది నుంచి కోటి మంది ఉండగలిగేలా సౌకర్యాలను కల్పించామని సీఎం యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు.

అలాగే, భక్తుల యొక్క భద్రత కోసం 55 పోలీస్‌ స్టేషన్లను యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేయగా.. 45,000 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. సాధువులకు సంబంధించిన 13 అఖాడాలు ఈ మహా కుంభ్ లో భాగం కానున్నాయి. ఆదివారం నాటికే లక్షల మంది భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు వచ్చేశారు. శనివారం 25 లక్షల మంది పవిత్ర స్నానాలు చేసుకోగా.. తెలుగుతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ భాషల్లోనూ సేవలందించే కాల్‌ సెంటర్లను ఉత్తర ప్రదేశ్ సర్కార్ ఏర్పాట్లు చేసింది.

తెలుగు రాష్ట్రాల నుంచి కుంభమేళాకు వెళ్లేవారి కోసం దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం, కాకినాడ టౌన్, తెలంగాణలోని మౌలాలి జంక్షన్, వికారాబాద్, సికింద్రాబాద్ స్టేషన్ల నుంచి సుమారు 26 ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.

మహాకుంభ మేళాకు 15లక్షల మందికిపైగా విదేశీ పర్యాటకులు వస్తారని కేంద్ర పర్యాటక శాఖ అంచనా వేస్తుంది. విదేశీ అతిథులను దృష్టిలో ఉంచుకుని పర్యాటక శాఖ ఆయుర్వేదం, యోగా, పంచకర్మ వంటి సౌకర్యాలను కల్పిస్తూ టెంట్ సిటీని ఏర్పాటు చేసింది. భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించేలా మహా కుంభమేళాలోని పది ఎకరాల్లో ‘కళాగ్రామం’ నిర్మించారు.

మహా కుంభమేళా చివరి రోజు శివరాత్రితో ముగుస్తుంది. ఆ రోజు స్నానమాచరించేందుకు పెద్దెత్తున భక్తులు వస్తారు.

Tags

Next Story