Maha Kumbh mela: నేడు కుంభమేళాలో 5వ పవిత్ర స్నానం..భారీ భద్రతా ఏర్పాట్లు

ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకి యూపీ సర్కార్ మరింత జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎంత ప్రయత్నించినా అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్న నేపధ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. 5వ పవిత్ర స్నానానికి ట్రాఫిక్ జామ్, భద్రతపై అధికారులు దృష్టిసారించారు. గత నెలలో అమృత స్నాన్ సమయంలో జరిగిన తొక్కిసలాటలో 30 మంది భక్తులు మరణించారు. దీంతో ఈ సారి ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. జనవరి 13న ప్రారంభమైన కల్పవాస కాలం ముగింపును సూచించే ‘‘మాఘ పూర్ణిమ’’ పవిత్ర స్నానానికి ముందు భద్రతను కట్టుదిట్టం చేశారు.
ట్రాఫిక్ జామ్‌ల నేపథ్యంలో ఇప్పటికే ప్రయాగ్‌రాజ్‌ని ‘‘వాహనాలు లేని జోన్’’గా మార్చారు. కల్పవాస్ అంటే ఒక పవిత్ర నది దగ్గర ఒక నిర్దిష్ట కాలం నివసించడం, ఉపవాసం, స్వీయ క్రమశిక్షణ, ఆత్మపరిశీలన, ఆధ్యాత్మిక శుద్ధికి కట్టుబడి ఉండటం.ఫిబ్రవరి 12న బుధవారం మాఘ పౌర్ణమి రోజున జరిగే ఐదో రాజస్నానానికి 3 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా.
భక్తుల భద్రత కోసం మొత్తం 133 అంబులెన్స్‌లను మోహరించారు. మహాకుంభ్‌నగర్‌లోని 40 కి పైగా ఆసుపత్రులు అప్రమత్తంగా ఉన్నాయి. 125 అంబులెన్స్‌లు, ఏడు రివర్ అంబులెన్స్‌లను సిద్ధం చేశారు. కుంభమేళాలో భక్తుల ఆరోగ్యం కోసం చిన్న ఆపరేషన్ల నుంచి పెద్ద సర్జరీలు చేసే వరకు ప్రతీ విభాగం ఏర్పాటు చేయబడింది. మహాకుంభ్‌లో 2000 మెడికల్ ఫోర్సెస్, మహా కుంభ నగర్‌లో స్వరూపరాణి నెహ్రూ హాస్పిటల్ (SRN)లో 700 మంది మెడికల్ ఫోర్సెస్ హై అలర్ట్ మోడ్‌లో ఉన్నాయి.
200 యూనిట్ల బ్లడ్ బ్యాంక్స్ సిద్ధంగా ఉన్నాయి. 250 పడకల ఆస్పత్రుల్లో రిజర్వ్ చేయబడ్డాయి. మహాకుంభనగర్‌లో 500 పడకల సామర్థ్యం కలిగిన ఆస్పత్రి సిద్ధంగా ఉంది. యుష్ మంత్రిత్వ శాఖ నుండి 150 మంది వైద్య సిబ్బందితో 30 మంది నిపుణులైన వైద్యులు మోహరించబడ్డారు. ఢిల్లీ ఎయిమ్స్, బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నిపుణులు కూడా ఉన్నారు. నగరంలో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ కదలికల్ని పర్యవేక్షించడానికి డ్రోన్లు ఉపయోగిస్తున్నారు. పారామిలిటరీ, రాపిడి యాక్షన్, యూపీ పోలీస్ దళాలు మోహరించబడ్డాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com