Doctor Suicide: మహారాష్ట్ర వైద్యురాలి ఆత్మహత్య కేసులో ఎస్సై సహా ఇద్దరి అరెస్ట్

మహారాష్ట్రలోని సతారా జిల్లాలో మహిళా డాక్టర్ ఆత్మహత్య చేసుకున్న కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎస్సై) గోపాల్ బడానేను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరో నిందితుడైన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రశాంత్ బంకర్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బీడ్ జిల్లాకు చెందిన ఒక మహిళా డాక్టర్ సతారాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. గురువారం రాత్రి ఫల్టాన్ పట్టణంలోని ఒక హోటల్ గదిలో ఆమె ఉరివేసుకుని విగతజీవిగా కనిపించారు. తన అరచేతిపై రాసుకున్న సూసైడ్ నోట్‌లో ఎస్ఐ గోపాల్ బడానే తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని, ప్రశాంత్ బంకర్ మానసికంగా వేధించాడని ఆమె ఆరోపించారు. దీంతో పోలీసులు అత్యాచారం, ఆత్మహత్యకు ప్రేరేపణ కింద కేసు నమోదు చేశారు.
ఈ నేపథ్యంలో పోలీసులు మొదట ప్రశాంత్ బంకర్‌ను పుణెలో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కొన్ని గంటలకే ఎస్సై బడానే ఫల్టాన్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. బంకర్‌ను కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం నాలుగు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. ఈ ఆరోపణల నేపథ్యంలో ఎసై బడానేను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ప్రశాంత్ బంకర్, మృతురాలు నివాసం ఉంటున్న ఇంటి యజమాని కుమారుడని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై మృతురాలి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిందితులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. వేధింపుల గురించి ఆమె గతంలో చాలాసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని బంధువులు ఆరోపించారు. పోస్ట్‌మార్టం డ్యూటీలో ఉన్నప్పుడు మెడికల్ రిపోర్టులు మార్చాలంటూ కొందరు రాజకీయ నేతల నుంచి ఒత్తిళ్లు వచ్చేవని కూడా వారు తెలిపారు.
ఈ కేసు ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. గతంలో ఓ సందర్భంలో బీజేపీ మాజీ ఎంపీ రంజిత్‌సింగ్ నాయక్ నింబాల్కర్ ఆమెపై ఒత్తిడి తెచ్చారని శివసేన (యూబీటీ) నేత అంబదాస్ దన్వే ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలను నింబాల్కర్ ఖండించారు. ఈ కేసులోకి కావాలనే తన పేరును లాగుతున్నారని ఆయన స్పష్టం చేశారు.
మృతురాలు ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చి, ఎండీ చేయాలని కలలు కన్నారని ఆమె బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు. ఎంబీబీఎస్ కోసం తీసుకున్న రూ.3 లక్షల అప్పు కూడా ఇంకా తీర్చలేదని వారు తెలిపారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

