Maharashtra Governor : వాళ్ళు వెళ్లిపోతే మహారాష్ట్రలో చిల్లి గవ్వ కూడా మిగలదు : మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోష్యారీ

Maharashtra Governor : వాళ్ళు వెళ్లిపోతే మహారాష్ట్రలో చిల్లి గవ్వ కూడా మిగలదు : మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోష్యారీ
Maharastra Governor : మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోష్యారీ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి

Maharashtra Governor : మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోష్యారీ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మహారాష్ట్ర నుంచి గుజరాతీలు, రాజస్థానీలను వెళ్లగొడితే అసలు డబ్బే ఉండదంటూ వ్యాఖ్యానించారు. దేశ ఆర్థిక రాజధానిగా పేరుగాంచిన ముంబయికి ఇక మీదట ఆ అర్హతే ఉండదంటూ మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై మండిపడ్డారు శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌. తక్షణమే ఆయనచేత రాజీనామా చేయించాలంటూ...సీఎం ఏక్‌నాథ్‌ షిండేను డిమాండ్‌ చేశారు సంజయ్‌రౌత్‌.

మొన్నటిదాకా శివసేనలో కుమ్ములాటలు, అధికార మార్పిడితో వార్తల్లో నిలిచిన మహారాష్ట్రలో ఇప్పుడు మరో వివాదం మొదలైంది. ముంబై, థానే నుంచి గుజరాతీలు, రాజస్థానీలు వెళ్లిపోతే మహారాష్ట్రలో డబ్బులే ఉండవని, దేశ ఆర్థిక రాజధాని స్తంభించిపోతుందన్నారు గవర్నర్ భగత్ సింగ్ కొష్యారి. ముంబైలోని అంధేరీలో ఓ కార్యక్రమానికి హాజరైన గవర్నర్ ఈ వ్యాఖ్యలు చేశారు. గవర్నర్‌ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి......

గవర్నర్‌ వ్యాఖ్యలను శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఖండించారు. గవర్నర్ కామెంట్లు కష్టపడి పని చేసే మరాఠీ ప్రజలను అవమానించేవిగా ఉన్నాయన్నారు. బీజేపీ మద్దతుతో సీఎం అయిన ఏక్ నాథ్ షిండేకు కూడా ఇది అవమానమన్నారు.

సీఎం షిండేకు ఏ మాత్రం ఆత్మగౌరవం ఉన్నా.. గవర్నర్‌తో తక్షణమే రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. ఇంత జరిగినా సీఎం ఏక్‌నాథ్‌ శిండే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు సంజయ్‌ రౌత్‌. లేనిపోని వివాదాలు సృష్టిస్తున్న గవర్నర్‌ను కేంద్రం వెంటనే వెనక్కి పిలవాలని డిమాండ్‌ చేశారు.

గవర్నర్ వ్యాఖ్యలపై మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే మండిపడ్డారు. మ‌రాఠీల‌ను అవ‌మానిస్తూ గ‌వ‌ర్నర్‌ హ‌ద్దు మీరి వ్యవ‌హ‌రిస్తున్నార‌న్నారు. భ‌గ‌త్ సింగ్ కోశ్యారీ..... మ‌రాఠీల‌ను అవ‌మానించ‌డంతో ప్రజ‌ల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంద‌న్నారు. తక్షణమే ఈ వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

శివసేన, కాంగ్రెస్‌తో పాటు..మిగతా పార్టీ నేతలు కూడా కోష్యారీ వ్యాఖ్యలను తప్పుబట్టడంతో.. గవర్నర్‌ కార్యాలయం వివరణ ఇచ్చింది. మహారాష్ట్ర అభివృద్ధిలో గుజరాతీలు, రాజస్థానీలు పోషించిన పాత్ర గురించి చెప్పడమే గవర్నర్‌ ఉద్దేశమని రాజ్‌భవన్‌ అధికారులు వివరణ ఇచ్చారు.

మరాఠీ ప్రజల మనోభావాలను దెబ్బతీయడం ఉద్దేశ్యం కాదన్నారు. మహారాష్ట్రను ఈ స్థాయిలో నిలపడానికి మరాఠీలు ఎంతో కష్టపడ్డారన్నారు. వాళ్లను కించపరిచే ఉద్దేశం లేదంటూ రాజ్‌భవన్‌ అధికారులు వెల్లడించారు.

మొత్తానికి.. మహారాష్ట్ర రాజకీయాల్లో గవర్నర్‌ వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌గా మారాయి. ఉద్ధవ్‌ థాక్రేకు చెందిన శివసేన నేతలు కార్యకర్తలు..గవర్నర్‌ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు.

Tags

Next Story