Student Paraglides: పారాగ్లైడింగ్ ద్వారా ఎక్సామ్ సెంటర్‌కు..

Student Paraglides: పారాగ్లైడింగ్ ద్వారా ఎక్సామ్  సెంటర్‌కు..
X
ట్రాఫిక్‌ను అధిగమించేందుకు విద్యార్థి ఉపాయం

ప్రధాన నగరాల్లో ట్రాఫిక్‌.. ఇదో పెద్ద సమస్యగా మారింది. కొంచెం దూరానికి గంటల తరబడి ప్రయాణించాల్సిన పరిస్థితి. ఉద్యోగులు సమయానికి పనిప్రదేశానికి చేరుకోవాలంటే రోజూ ఇదో సవాల్‌గా మారుతోంది. మరోవైపు దేశ వ్యాప్తంగా బోర్డు పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయాన్నే విద్యార్థులు ఉరుకులు, పరుగులతో ఎగ్జామ్స్ సెంటర్లకు చేరుకుంటున్నారు.

ఇక విద్యార్థులకు సైతం ట్రాఫిక్‌ సమస్య తలనొప్పిగా మారుతోంది. పరీక్షల వేళ సమయానికి చేరుకోలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలోనే ఎగ్జామ్‌ సెంటర్‌కు సమయానికి చేరుకునేందుకు ఓ విద్యార్థి అసాధారణ మార్గాన్ని ఎంచుకున్నాడు. ఏకంగా పారాగ్లైడింగ్‌ చేస్తూ ఇన్‌టైమ్‌కి ఎగ్జామ్‌ సెంటర్‌కు చేరుకున్నాడు. ఈ ఆసక్తికర ఘటన మహారాష్ట్ర సతారా జిల్లాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. వాయ్‌ తాలూకా పసరణి గ్రామానికి చెందిన సమర్థ్‌ మహంగడే అనే విద్యార్థి వ్యక్తిగత పని నిమిత్తం పంచగని వెళ్లాడు. అయితే, అతడు పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉంది. కానీ వాయ్‌ – పంచగని రహదారిలో పసరణి ఘాట్‌ సెక్షన్‌లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఉంటుంది. ట్రాఫిక్‌కు తప్పించుకుని వెళ్లాలంటే గంటల సమయం పడుతుంది. అయితే, అతడికి అంత టైమ్‌ లేదు. 20 నిమిషాల్లో కాలేజీకి చేరుకోవాల్సి ఉంది. దీంతో ట్రాఫిక్‌ను అధిగమించి ఇన్‌టైమ్‌కి చేరుకునేందుకు అతడు పారాగ్లైడింగ్‌ మార్గాన్ని ఎంచుకున్నాడు. ఇందుకోసం అతడికి పంచగనిలోని జీపీ అడ్వెంచర్స్‌కు చెందిన సాహస క్రీడా నిపుణుడు గోవింద్ యెవాలే సహాయం చేశాడు. అతడి సాయంతో విద్యార్థి తన బ్యాగ్‌తో ఆకాశంలో ఎగురుతూ సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

Next Story