Narayan Gangaram Surve House: సారీ సర్ .. మీ ఇల్లు అని తెలియక
మహరాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో ఈ విచిత్ర దొంగతనం ఘటన జరిగింది. ఆ ఇంటికి చాలా రోజులుగా తాళం వేసి ఉండటాన్ని గమనించిన ఓ దొంగ రాత్రిపూట ఈ ఇంట్లోకి చొరబడి.. సామాన్లు మొత్తం దొంగతనం చేసేందుకు సర్దేశాడు. ఇక బయటికి వెళ్దాం అనేలోపే.. ఆ ఇల్లు ఓ ప్రముఖ కవిది అని గుర్తించాడు. దీంతో వాటిని అక్కడే పెట్టి వెళ్లిపోయాడు. స్థానిక పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రముఖ మరాఠీ కవి, సామాజికవేత్త నారాయణ్ సువే.. 2010లోనే చనిపోయారు. ఆయన ఇంట్లో ప్రస్తుతం నారాయణ్ సువే కుమార్తె సుజాత.. అల్లుడు గణేష్ ఘారే నివాసం ఉంటున్నారు. అయితే కొన్ని రోజుల క్రితం సుజాత, గణేష్ ఘారే విరార్‌లోని.. వారి కుమారుడి వద్దకు వెళ్లారు. దాదాపు 10 రోజులుగా ఆ ఇంటికి తాళం వేసి ఉండడాన్ని ఒక దొంగ గమనించాడు.
దీంతో ఆ ఇంట్లోకి దూరి ఎల్‌ఈడీ టీవీతోపాటు పలు విలువైన వస్తువులను దొంగలించాడు. ఆ తర్వాత రోజు కూడా ఇంటికి తాళం వేసి ఉండటంతో మిగిలిన వస్తువులను కూడా దొంగిలించేందుకు మళ్లీ వెళ్లాడు. ఆ సమయంలో ఆ ఇంట్లో రచయిత నారాయణ్ ఫోటోలు, అవార్డులు, జ్ఞాపికలు కనిపించాయి. దాంతో తాను ఆ ఇంట్లో దొంగతనం చేసి తప్పు చేశానని గమనించాడు. దీంతో పశ్చాత్తాపం చెంది.. అంతకుముందు రోజు దొంగిలించిన వస్తువులను కూడా తిరిగి తీసుకువచ్చి ఆ ఇంట్లోనే పెట్టేశాడు. గొప్ప సాహితీవేత్త ఇంట్లో తాను దొంగతనం చేసినందుకు క్షమించాలని వేడుకుంటూ ఓ లేఖను రాసి అక్కడే పెట్టించి వెళ్లాడు.
ఇక ఈ ఘటన జరిగిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన సుజాత, ఆమె భర్త గణేష్ ఘారే.. ఆ లేఖ చూసి అవాక్కయ్యారు. వెంటనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎల్ఈడీ టీవీపై ఉన్న వేలిముద్రల అధారంగా విచారణ చేపట్టిన పోలీసులు ఆ దొంగ కోసం వెతకడం ప్రారంభించారు.
ఇక రైటర్ నారాయణ్ ముంబైలో అనాథగా పెరిగారు. కూలీ పనులు చేసుకుంటూనే చదవడం, రాయడం నేర్చుకున్న ఆయన రెండో తరగతి మాత్రమే చదువుకున్నప్పటికీ మరాఠీ భాషాలోని ఉత్తమ రచయితల్లో ఒకరిగా ఘన కీర్తిని గడించారు. పట్టణ శ్రామిక వర్గంపై నారాయణ్ అనేక రచనలు చేశారు. ఆయనను భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. రష్యా నుంచి సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డు అందుకున్నారు.
Crime News
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com