Delhi: షోరూమ్ ఫస్ట్‌ఫ్లోర్‌లో నిమ్మకాయ తొక్కిస్తుండగా కిందపడ్డ కారు..

కొత్త కారు కొన్నామనే ఆనందంలో నిమ్మకాయల్ని తొక్కించబోతే.. అదికాస్తా ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందపడి ధ్వంసముంది. ఈ ఘటన దిల్లీలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవికాస్త వైరల్‌గా మారాయి. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. ఘజియాబాద్‌కు చెందిన మాని పవార్ అనే మహిళ ఇటీవల రూ.27 లక్షల విలువైన థార్ ఎస్‌యూవీ ని ఆర్డర్ చేశారు. సోమవారం దానిని తీసుకోవడానికి నిర్మాణ్ విహార్‌లోని మహీంద్రా షోరూమ్‌కు వెళ్లారు.
కొత్త కారు కొన్నామనే ఆనందంలో దానిని బయటకు తీసుకువెళ్లే ముందు పూజ చేయాలని అనుకున్నారు. ఈక్రమంలో మాని పవార్ షోరూమ్ ఫస్ట్ ఫ్లోర్‌లో థార్‌తో నిమ్మకాయలను తొక్కించారు. అదే సమయంలో ఆమె అనుకోకుండా యాక్సిలేటర్‌ను నొక్కడంతో వాహనం షోరూమ్ మొదటి అంతస్తు నుంచి ఎగిరి.. అద్దాలను బద్దలుకొట్టుకుంటూ కింద ఉన్న పేవ్‌మెంట్ పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో థార్ లో మాని, ఆమె భర్త ప్రదీప్ నిర్మన్, షోరూమ్ సిబ్బంది ఉన్నారని.. ఎయిర్‌బాగ్స్ తెరుచుకోవడంతో అందులో ఉన్నవారికి ఎటువంటి ప్రమాదం జరగలేదని పోలీసులు తెలిపారు. బాధితులను వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com