Mahindra Car : కారులో లోపం లేదు, ఎయిర్‌బ్యాగ్ ఓపెన్ కాలేదనే కేసుపై వివరణ

ఉత్తరప్రదేశ్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన అపూర్వ్ మిశ్రా మృతికి మహీంద్రా కంపెనీ వాహనం కారణమంటూ నమోదైన కేసుపై మహీంద్రా కంపెనీ స్పందించింది. అతని మరణించటానికి మహీంద్రా కారు కారణం అంటూ చేసిన ఆరోపణలను తోసిపుచ్చింది. మృతి చెందిన వ్యక్తి నడుపుతున్న స్కార్పియో SUV ఎయిర్ బ్యాగ్ లలో ఎలాంటి లోపం లేదని వివరణ ఇచ్చింది.
మహీంద్రా అండ్ మహీంద్రా ఛైర్మన్ ఆనంద్ మహీంద్రాపై ఇటీవల దాఖలైన చీటింగ్ కేసుకు సంబంధించి పూర్తి వివరణతో ఆ కంపెనీ తాజాగా ఒక ప్రెస్ నోట్‌ను విడుదల చేసింది. 2020 లో మహీంద్రా స్కార్పియో కారు ప్రమాదానికి గురై అందులో ఉన్న ఓ వ్యక్తి చనిపోవడంతో ఆ వ్యక్తి తండ్రి ఆనంద్ మహీంద్రాతోపాటు మరో 12 మంది కంపెనీ ఉద్యోగులపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే అసలు ఆ ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను.. ఆ ఘటనపై తమ కంపెనీ జరిపిన దర్యాప్తును వివరించింది. ఈ ఘటనలో స్కార్పియో వాహనంలో ఎయిర్‌బ్యాగులకు సంబంధించి ఎలాంటి లోపాలు తలెత్తలేదని మహీంద్రా కంపెనీ స్పష్టం చేశారు.
సెప్టెంబరు 23 వ తేదీన నమోదైన ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్న దాదాపు రూ. 20 లక్షల విలువైన స్కార్పియో కారుకు సంబంధించి భద్రతా పరంగా ఎలాంటి లోపాలు లేవని మరోసారి స్పష్టం చేసింది. ఈ కేసు 18 నెలల కిందటిది అని మహీంద్రా కంపెనీ వెల్లడించింది. ఈ సంఘటన 2022 జనవరిలో జరిగిందని, స్కార్పియోలో ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి కానీ స్కార్పియో వాహనం బోల్తా వాహనం బోల్తా పడినపుడు ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు ఓపెన్ కావని వెల్లడించింది. 2020 లో తయారైన స్కార్పియో S9 వేరియంట్ వాహనంలో ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయని, ఈ ఘటనపై మహీంద్రా కంపెనీకి చెందిన టెక్నికల్ టీమ్.. 2022 అక్టోబర్‌లో పూర్తి దర్యాప్తు నిర్వహించి వివరాలు సేకరించినట్లు చెప్పింది. తమ పరిశీలనలో ప్రమాదానికి గురైన స్కార్పియోలో ఎయిర్‌బ్యాగ్‌ల లోపం లేదని తేలిందని మరోసారి చెప్పింది.
కేసు ప్రస్తుతం న్యాయస్థానంలో విచారణలో ఉందని మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ తెలిపింది. ఈ కేసు విచారణలో న్యాయపరంగా అన్ని విధాలుగా సహకరిస్తున్నామని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఈ ప్రమాద ఘటనలో చనిపోయిన బాధితుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తున్నట్లు తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com