Mahua Moitra : ఎంపీ మహువా మొయిత్రాపై బీజేపీ సంచలన ఆరోపణలు

Mahua Moitra :  ఎంపీ మహువా మొయిత్రాపై బీజేపీ సంచలన ఆరోపణలు
ప్రశ్నలడిగేందుకు మహువా డబ్బు తీసుకున్నారన్న ఎంపీ నిషికాంత్

తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మహువా మొయిత్రాపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సంచలన ఆరోపణలు చేశారు. పార్లమెంట్‌లో ప్రశ్నలు అడగడానికి మహువా మొయిత్రా లంచం తీసుకున్నారని ఆరోపించారు.ఆమె ఒక వ్యాపారవేత్త నుంచి డబ్బు తీసుకున్నారని, మహువా పై విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ దూబే లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.

పార్లమెంట్ లో ప్రశ్నలు అడగేందుంకు ఎంపీకి, సదరు వ్యాపారవేత్తకు మధ్య లంచాలు మారాయని, డబ్బులు, గిఫ్టుల రూపంలో లంచాలు తీసుకున్నారని బీజేపీ ఎంపీ దూబే ఆరోపించారు. మహువా మొయిత్రాను వెంటనే సభ నుంచి సస్పెండ్ చేయాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు రెండు పేజీల లేఖను దూబే రాశారు.


పార్లమెంట్ సమావేశాలు జరిగినప్పుడల్లా మహువా మొయిత్రాతో పాటు టీఎంసీ ఎంపీలకు సభకు అడ్డుతగలడం అలవాటుగా మారిందని, ప్రతీ ఒక్కరిపై ఏదో సాకుతో సభను నిరంతరం దుర్వినియోగం చేస్తున్నారని, సౌగతా రాయ్ నేతృత్వంలోని ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించడం అలవాటు చేసుకున్నదన్నారు. ఇటీవలి వరకు ఆమె లోక్‌సభలో అడిగిన 61 ప్రశ్నల్లో 50 ప్రశ్నలు అదానీ గ్రూప్‌పైనే ఉన్నాయని, ఇక్కడ అక్రమాలు జరిగాయని ఆమె తరుచుగా ఆరోపించారని దూబే స్పీకర్ కి రాసిన రెండు పేజల లేఖలో పేర్కొన్నారు.

తృణమూల్ కాంగ్రెస్ నేతల వ్యూహాలు సామాన్య ప్రజల సమస్యలు, ప్రభుత్వ విధానాలపై చర్చించేందుకు, ఇతర సభ్యుల రాజ్యాంగ హక్కుల్ని హరిస్తున్నాయిన బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే అన్నారు. ‘క్విడ్ ప్రోకో’ విధానంలో ఒక వ్యాపారవేత్త నుంచి డబ్బులు తీసుకుని మరో వ్యాపార గ్రూపుని లక్ష్యంగా చేసుకున్నారని బీజేపీ ఎంపీ ఆరోపించారు. మహువా మొయిత్రా ఫైర్ బ్రాండ్ ఎంపీ అనే బిరుదు బూటకం తప్ప మరేమి కాదని విమర్శించారు.

అయితే దూబే వ్యాఖ్యలపై స్పందించిన టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా… తనకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలనైనా స్వాగతిస్తానని అన్నారు. నిషికాంత్‌ దుబేపై నకిలీ అఫిడవిట్లు, ఇతర అభియోగాలపై దర్యాప్తు పూర్తి చేశాక తనపై ఎలాంటి చర్యలు తీసుకున్నా స్వాగతిస్తానని స్పష్టం చేశారు. నిషికాంత్ ఆరోపణల్ని హీరానందానీ గ్రూప్‌ కొట్టిపారేసింది. ఆయన ఆరోపణల్లో నిజం లేదన్న సంస్థ, తాము ఎప్పుడూ వ్యాపారంలోనే ఉన్నామని స్పష్టం చేసింది. దేశ ప్రయోజనాల కోసమే తమ గ్రూపు ఎప్పుడూ ప్రభుత్వంతో కలిసి పని చేస్తుందని, దాన్నే కొనసాగిస్తుందని తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story