America :హెలికాప్టర్‌ను ఢీకొట్టిన విమానం.. అమెరికాలో పెను ప్రమాదం..

మెరికాలోని వాషింగ్టన్ లో ఘోర విమాన ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. 64 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ విమానం.. మిలిటరీ హెలికాప్టర్‌ను ఢీకొట్టింది. దీంతో రెండూ పక్కనే ఉన్న పోటోమాటిక్ నదిలో కూలిపోయాయి. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకూ 18 మృతదేహాలను వెలికి తీసినట్లు అధికారులు తెలిపారు.
పీఎస్‌ఏ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 60 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బందితో కాన్సాస్‌లోని విషిటా నుంచి బయల్దేరింది. బుధవారం రాత్రి 8.30 గంటల సమయంలో రోనాల్డ్ రీగన్ ఎయిర్‌పోర్టు లో దిగేందుకు సిద్ధమవుతుండగా.. రక్షణ శాఖకు చెందిన సికోర్‌స్కీ హెచ్-60 బ్లాక్‌హాక్ హెలికాప్టర్‌ను ఢీకొట్టింది. దీంతో భారీ శబ్ధంతో అవి రెండూ నదిలో కుప్పకూలాయి.
అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఆ విమానాన్ని పీఎస్‌ఏ నిర్వహిస్తున్నది. సమాచారం అందుకున్న అధికారులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ప్రయాణికుల కోసం నదిలో గాలిస్తున్నారు. కాగా, ఈ ప్రమాదం కారణంగా రోనాల్డ్ రీగన్ విమానాశ్రయాన్ని అధికారులు మూసివేశారు. విమానాల రాకపోకలు నిలిపివేశారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com