PARLIAMENT LEGACY: చరిత్ర పుటల్లోకి పార్లమెంట్‌ పాత భవనం

PARLIAMENT LEGACY: చరిత్ర పుటల్లోకి పార్లమెంట్‌ పాత భవనం
ఎన్నో చారిత్రక ఘట్టాలకు సాక్షిభూతంగా నిలిచిన ప్రజా సౌధం... 96 ఏళ్ల భారత ప్రయాణానికి సజీవ సాక్ష్యం

స్వతంత్ర భారతంలోని కీలక ఘట్టాలకు, ఎమర్జెన్సీలాంటి చీకటి ఘట్టాలకు, ఆధునిక భారత ప్రస్థానానికి దారితీసిన సంస్కరణలకు నిదర్శనంలా నిలిచింది పార్లమెంట్‌ పాత భవనం. నవ భారత నిర్మాణంలోని ప్రతీ మలుపునకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచిన ఈ ప్రజాస్వామ్య సౌధం 96 ఏళ్ల భారత ప్రయాణ కాలానికి ప్రతీకగా నిలిచింది. 1911లో కోల్‌కతా నుంచి రాజధానిని ఢిల్లీకి తరలించాలని నిర్ణయించిన బ్రిటిష్‌ ప్రభుత్వం ఇందుకోసం కొత్త ఢిల్లీని ప్రత్యేకంగా నిర్మించింది. ఆ సమయానికి పార్లమెంటు కట్టాలని వారికి ఆలోచనే లేదు. గవర్నర్‌ జనరల్‌ నివాసం అంటే ప్రస్తుత రాష్ట్రపతి భవనంలోనే లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ సమావేశ మందిరం కూడా ఏర్పాటు చేస్తే సరిపోతుందని అనుకున్నారు. కానీ 1918 మాంటెగు చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణలతో చట్టసభల ప్రాధాన్యంతో పాటు ఎగువ, దిగువ సభలు అమల్లోకి వచ్చాయి. వీటి నిర్వహణతో పాటు సభ్యులు, పరిపాలన సిబ్బంది పెరిగారు. దీంతో బ్రిటిష్‌ ప్రభుత్వం రెండు ప్రతిపాదనలతో ముందుకొచ్చింది. ఒకటి టెంట్‌లో సభను నిర్వహించటం. రెండోది భవంతిని నిర్మించటం. షామియానా కింద నిర్వహిస్తే పరువు పోతుందనే ఉద్దేశంతో రెండో ప్రతిపాదనకే మొగ్గు చూపి 1921లో సెక్రటేరియెట్‌ బిల్డింగ్‌లోనే ఓ భారీ ఛాంబర్‌ కట్టారు. అదే సెంట్రల్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీ తొలి భవంతి.


కొత్త ఢిల్లీ రూపశిల్పులైన బ్రిటిష్‌ ఆర్కిటెక్టులు ఎడ్విన్‌ ల్యూటెన్‌, హెర్బర్ట్‌ బేకర్‌లు ఎగువ, దిగువ చట్టసభలకు శాశ్వత భవన నిర్మాణాలు ప్రతిపాదించారు. ల్యూటన్‌ వృత్తాకారంలో ఉన్న ప్రణాళికకే బ్రిటిష్‌ సర్కారు మొగ్గు చూపింది. 1921 ఫిబ్రవరి 12న డ్యూక్‌ ఆఫ్‌ కానాట్‌ ప్రిన్స్‌ ఆర్థర్‌ కొత్త పార్లమెంటు భవనానికి శంకుస్థాపన చేశారు. ఆరేళ్లలో తయారైన ఈ భవనాన్ని 1927 జనవరి 19న అప్పటి భారత వైస్రాయ్‌ లార్డ్‌ ఇర్విన్‌ ప్రారంభించారు. ఆరు ఎకరాల విస్తీర్ణంలో 144 పిల్లర్లతో తయారైన ఈ అందమైన భవంతి మధ్యలో సెంట్రల్‌ హాల్‌, దాని పక్కనే మూడు అర్ధవృత్తాకార ఛాంబర్లు చుట్టూ ఉద్యానవనంతో ఆకట్టుకునేలా నిర్మించారు. ఈ పార్లమెంటు భవనం ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించింది.


పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌ చుట్టూ ఉండే ఒక ఛాంబర్‌లో సంస్థానాధీశుల సభ, మరోదాంట్లో స్టేట్‌ కౌన్సిల్‌, మూడోదాంట్లో సెంట్రల్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీ ఉండేవి. ఈ లెజిస్లేటివ్‌ అసెంబ్లీలో 1929లో విప్లవకారుడు భగత్‌సింగ్‌, బతుకేశ్వర్‌ దత్‌లు బాంబు విసిరి సంచలనం సృష్టించారు. స్వాతంత్య్రానంతరం బ్రిటిష్‌ నుంచి అధికార మార్పిడి ఈ పార్లమెంటు భవనంలోనే జరిగింది. కొత్త ఏర్పాట్లు జరిగేదాకా మొదట్లో సుప్రీంకోర్టు కూడా ఛాంబర్‌ ఆఫ్‌ ప్రిన్సెస్‌ నుంచే కార్యకలాపాలు నిర్వహించింది. యూపీఎస్సీ కార్యాలయం కూడా పార్లమెంటులోనే ఉండేది. స్థలాభావాన్ని అధిగమించటం కోసం 1956లో పాత పార్లమెంటులో మరో రెండు అంతస్థులు నిర్మించారు. 2001లో పాకిస్థాన్‌ దన్నుతో లష్కరే తోయిబా తీవ్రవాదుల దాడినీ ఈ ప్రజాస్వామ సౌథం ఎదుర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story