JK Elections: మోదీని గద్దె దింపే దాకా నేను చనిపోను- ఖర్గే

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అస్వస్థతకు గురయ్యారు. జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉన్న మల్లిఖార్జున ఖర్గే.. ఆదివారం కథువా జిల్లాలో పర్యటించారు. అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. అయితే ప్రసంగిస్తున్న సమయంలో ఖర్గే కాస్త అనారోగ్యానికి గురయ్యారు. ప్రసంగిస్తున్న సమయంలోనే కళ్లు తిరిగి కిందపడబోయారు. అయితే పక్కనున్న నేతలు వెంటనే అలర్ట్ అయ్యారు. ఖర్గేను కిందపడనీయకుండా పట్టుకున్నారు. కుర్చీలో కూర్చోబెట్టారు. మంచినీళ్లు తాగించారు. అయితే కొద్దిసేపటి తర్వాత వైద్యులు వచ్చి మల్లిఖార్జున ఖర్గేను పరీక్షించారు. వైద్య పరీక్షల్లో బీపీ కాస్త కంట్రోల్ తప్పడంతోనే ఆయన కిందపడబోయినట్లు తెలిసింది.
అయితే అస్వస్థతకు గురైనప్పటికీ ఖర్గే తన ప్రసంగాన్ని ఆపలేదు. కాంగ్రెస్ నాయకుల మద్దతుతో మల్లిఖార్జున ఖర్గే తన ప్రసంగాన్ని కొనసాగించారు. కాంగ్రెస్ నేతలు సపోర్ట్‌గా సాయం అందించడంతో లేచి నిలబడిన ఖర్గే తన ప్రసంగాన్ని కొనసాగించారు. తన అస్వస్థత విషయాన్ని ప్రస్తావిస్తూనే కేంద్రం మీద, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపైనా విమర్శలు గుప్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అధికారం నుంచి కిందకు దించే వరకూ తాను చనిపోనంటూ మల్లిఖార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించే వరకూ మనం పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం తనకు 83 ఏళ్లు వయసు అని.. ఇప్పుడప్పుడే తాను చనిపోనంటూ వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని గద్దె దింపేవరకూ తాను బతికే ఉంటానని అన్నారు.
ఆరా తీసిన మోదీ
ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. ఖర్గేకు ఫోన్ చేసి ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మల్లికార్జున ఖర్గే త్వరగా కోలుకోవాలని ప్రధాని మోడీ ఆకాంక్షించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. తన ఆరోగ్యం గురించి ప్రధాని మోడీకి ఖర్గే వివరించినట్లు సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com