Exam Malpractice: పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే కోటి జరిమానా

Exam Malpractice: పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే కోటి జరిమానా
10 ఏళ్ల జైలు శిక్ష కూడా

పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వారిపై కేంద్ర ప్రభుత్వం కఠిన నిబంధనలు తీసుకురానున్నది. అందులో భాగంగా సోమవారం లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టింది. దీని కింద నేరం నిరూపితమైతే గరిష్ఠంగా పదేండ్లు జైలు, కోటి రూపాయల వరకు జరిమానా విధించనున్నారు.

పోటీ పరీక్షల విషయంలో ఇప్పటివరకూ ఎన్నో అక్రమాలు చోటు చేసుకున్న ఘటనలు వెలుగు చూశాయి. ఒకరి స్థానంలో మరొకరితో పరీక్షలు రాయించడమో, ముందుగానే పేపర్లు లీక్ చేయడమో వంటిని చాలా జరిగాయి. ఇలాంటి వ్యవహారాల వెనుక కేవలం ఒకరిద్దరి హస్తం మాత్రమే ఉండదు.. పెద్ద మాఫియా గ్యాంగే ఉంటుంది. ఇలాంటి వాళ్ల వల్లే విద్యార్థుల జీవితాలు రోడ్డున పడుతుంటాయి. దీనిని దృష్టిలో ఉంచుకునే.. కేంద్ర ప్రభుత్వం సోమవారం ఒక కొత్త బిల్లుని తీసుకొచ్చింది. మాల్‌ప్రాక్టీస్‌కి పాల్పడే అక్రమార్కులను అడ్డుకోవడం కోసం.. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిన్ మీన్స్) బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లుని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ప్రవేశపెట్టారు.


ఈ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (అన్యాయమైన మార్గాల నివారణ) బిల్లు ప్రకారం.. ప్రభుత్వ అధికారులతో కుమ్మక్కై పరీక్ష పత్రాలను లీక్ చేసిన వారికి లేదా జవాబు పత్రాలను తారుమారు చేసిన వారికి మాత్రమే 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.1 కోటి జరిమానా విధించబడుతుంది. చిత్తశుద్ధితో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులను ఈ బిల్లు లక్ష్యంగా చేసుకోదని.. అక్రమార్కుల ఆట కట్టించడమే ఈ బిల్లు ఉద్దేశం. మరో విశేషం ఏమిటంటే.. ఈ బిల్లు కింద నేరాలన్ని నాన్-బెయిలబుల్, నాన్-కాంపౌండ్. అంటే.. పోలీసులకు సొంతంగా చర్య తీసుకునే అధికారం ఉంటుంది. వారెంట్ లేకుండానే అనుమానుతుల్ని అరెస్ట్ చేయొచ్చు. నిందితుడికి బెయిల్‌కు అర్హత ఉండదు. అలాగే.. ఆరోపణలు రాజీ ద్వారా పరిష్కరించబడవు. రాజస్థాన్, హరియాణా, గుజరాత్, బిహార్ వంటి రాష్ట్రాల్లో ప్రశ్నాపత్రాలు లీకేజీల కారణంగా పోటీ పరీక్షలు వాయిదా పడిన తరుణంలో.. కేంద్రం ఈ కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది.

ఈ బిల్లు గురించి మొదటిసారి జనవరి 31న పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రస్తావించారు. ఎగ్జామ్స్‌లో జరిగే అక్రమాల వల్ల యువత పడే ఆందోళన ప్రభుత్వం గుర్తించిందని, ఈ సమస్యపై కఠినంగా వ్యవహరించేందుకు సరికొత్త చట్టాన్ని రూపొందించాలని నిర్ణయించిందని ముర్ము వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story