Mamata Banerjee : అయోధ్య వేడుకకు మమతా బెనర్జీ దూరం?

ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చురుగ్గాయా సాగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 22న విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం వైభవంగా జరుగనున్నది.మరో వైపు శ్రీరామజన్మభూమి తీర్థకేత్ర ట్రస్ట్ వేడుకకు హాజరుకావాలని ప్రముఖులకు ఆహ్వానాలను పంపుతున్నది. ఇందులో భాగంగా ఇప్పటికే దేశంలోని పలువురు రాజకీయ నేతలకు ఆహ్వానాలు అందిన విషయం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమాన్ని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించినట్లు తెలుస్తోంది.
ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హాజరుకాకూడదని నిర్ణయించుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సీఎం తరఫున ప్రతినిధిని పంపే యోచనలో కూడా టీఎంసీ లేదని సమాచారం. అయితే, ఈ విషయంపై తృణమూల్ కాంగ్రెస్ తమ నిర్ణయాన్ని స్వయంగా ప్రకటించలేదు.
ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత చివరకు నవంబర్ 9, 2019న సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. వివాదాస్పద స్థలంలో రామాలయం నిర్మాణానికి సమ్మతించింది.. మసీదు నిర్మాణానికి ముస్లింలకు ఐదెకరాల స్థలాన్ని కేటాయించాలని తీర్పునిచ్చింది. ఆ తర్వాత ఆలయ నిర్మాణానికి పునాది రాయి వేయగా.. జనవరి 22న ఆలయంలో ప్రాణ ప్రతిష్ట కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనవరి 16న వేడుకలు మొదలై.. అదే నెల 22న ముగియనున్నాయి.
జనవరి 15 నాటికి వేడుకలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ పేర్కొన్నారు. 22న గర్భాలయంలో రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్టాపన జరుగనుండగా.. ప్రధాని మోదీ హాజరవనున్నారు. ఈ వేడుకకు రాజకీయ నాయకులతోపాటు బౌద్ధ మత గురువు దలైలామా, ముఖేష్ అంబానీతో పాటు నటీనటులు, పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు హాజరుకానున్నారు. మరో వైపు అయోధ్య రామాలయం ప్రారంభోత్సవ నేపథ్యంలో దేశమంతా వేడుకలు నిర్వహించనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com