Mamata Banerjee: రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో మమతా బెనర్జీ దూకుడు.. 22 పార్టీలకు, సీఎంలకు లేఖ..

Mamata Banerjee: రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో మమతా బెనర్జీ దూకుడు.. 22 పార్టీలకు, సీఎంలకు లేఖ..
Mamata Banerjee: బెంగాల్‌ సీఎం మమత బెనర్జీ దేశ రాజకీయాల్లో సరికొత్త సంచలనానికి తెరతీస్తున్నారు.

Mamata Banerjee: బెంగాల్‌ సీఎం మమత బెనర్జీ దేశ రాజకీయాల్లో సరికొత్త సంచలనానికి తెరతీస్తున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్యే పోటీ అనుకున్నారు. అనూహ్యంగా మమత బెనర్జీ ఓ ప్రతిపాదనతో తెరపైకి వస్తున్నారు. రాష్ట్రపతి అభ్యర్ధిగా ఎవరిని నిలబెడదామో మాట్లాడుకుందాం రండంటూ ఏకంగా 22 పార్టీలకు, ముఖ్యమంత్రులకు లేఖ రాశారు.

జాతీయ పార్టీలు కాకుండా ఇప్పటి వరకు సీఎం కేసీఆర్‌ మాత్రమే రాష్ట్రపతి ఎన్నికలపై అంతర్గత చర్చలు జరిపారు. కాని, మమత బెనర్జీ నుంచి ఇలా సైలెంట్ వార్ వస్తుందని ఎవరూ ఊహించలేదు. అందులోనూ సోనియాగాంధీ, శరద్ పవార్‌, స్టాలిన్‌ సహా ప్రతిపక్షాల సీనియర్‌ నేతలు 15వ తేదీనే సమావేశం కావాలనుకున్నారు. సరిగ్గా అదే రోజు, అదే ముహూర్తానికి తాను ఏర్పాటు చేసే సమావేశానికి ఢిల్లీ రావాల్సిందిగా లేఖలు రాశారు.

విపక్షాలను ఏకం చేయడం కోసం కాంగ్రెస్ అధినేత్రి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. పైగా ఇవాళ ఢిల్లీలో సోనియాతో శరద్‌ పవార్‌ సమావేశం అవుతున్నారు. సారథ్య స్థానంలో ఉంటూ విపక్ష పార్టీలను ఏకం చేసే బాధ్యతను సోనియాగాంధీ తీసుకున్నారు. ఈ జాబితాలోకి మమతా బెనర్జీని కూడా తీసుకొద్దామని ప్లాన్ చేశారు సోనియాగాంధీ. కాని, నాయకత్వం తానే వహిస్తానంటూ ఏకంగా సోనియాగాంధీకే ఆహ్వాన లేఖ పంపారు మమతా బెనర్జీ.

15వ తేదీన ఢిల్లీలో మీటింగ్‌కు రావాలంటూ రాసిన లేఖ అధినేత్రి సోనియాకు కూడా వెళ్లింది. సీఎం కేసీఆర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కేరళ ముఖ్యమంత్రి విజయన్‌, ఒడిశా సీఎం నవీన్‌పట్నాయక్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే, జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌కు లేఖలు రాశారు. కాని సీఎం జగన్‌కు మాత్రం ఆహ్వానం పంపలేదు.

ఇక ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఆర్‌జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ, కుమారస్వామి, ఫరూక్‌ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, బాదల్‌ సహా మొత్తం 22 పార్టీలకు ఆహ్వాన లేఖ పంపారు మమతా బెనర్జీ.

నిజానికి కాంగ్రెస్‌ జాతీయ పార్టీనే అయినప్పటికీ.. రాష్ట్రాల్లో బలం ప్రాంతీయ పార్టీలదే. పైగా మోదీ సర్కార్‌ను ఎదుర్కోవడంలో జాతీయ పార్టీగా కాంగ్రెస్‌ కంటే.. మిగిలిన ప్రాంతీయ పార్టీలే ఎక్కువగా ఫైట్ చేస్తున్నాయి. దీంతో కాంగ్రెస్‌ పార్టీనే ప్రాంతీయ పార్టీలతో కలిసి నడవాలి తప్ప.. కాంగ్రెస్‌ తమను నడిపించకూడదన్న ఆలోచనలో ఉన్నాయి.

దీని పర్యవసానమే.. మమతా బెనర్జీ సారథ్యం అని పొలిటికల్‌ సర్కిల్‌లో వినిపిస్తోంది. ఈ మీటింగ్‌కు సోనియాగాంధీనో, పార్టీ తరపు ఎవరో ఒకరు హాజరైతే ఇక మమతనే కింగ్ మేకర్ అవుతారు. మరి ఈ సమావేశానికి ఎవరెవరు హాజరవుతారన్నది సస్పెన్స్. ప్రస్తుతానికైతే, బీజేపీ అభ్యర్ధిని ఓడించాలనే కసితో ఉన్నాయి విపక్షాలు. ఆ సమీకరణంతో మమతా బెనర్జీ మీటింగ్‌కు దాదాపుగా అందరూ వస్తారనే చర్చ జరుగుతోంది.

అయితే, మమతా బెనర్జీ ప్రయత్నాలపై కొన్ని పార్టీలు వ్యతిరేక కామెంట్స్ చేస్తున్నాయి. విపక్షాల సమావేశంలో ఐక్యత రాకపోగా.. వ్యతిరేక ఫలితాలు ఇవ్వొచ్చని సీపీఎం నేత సీతారాం ఏచూరి అభిప్రాయం వ్యక్తం చేశారు. విపక్షాలన్నీ ఐక్యమవుతున్న వేళ.. మమతా బెనర్జీ ఇలా చేయడం వల్ల బీజేపీకి లబ్ది చేకూరుతుందని కొన్ని పార్టీలు చెబుతున్నాయి. పైగా రాజ్యసభలో ఎన్‌డీఏ బలం 117కి పెరిగింది. ఎలాగూ వైసీపీ, బీజేడీ మద్దతిస్తాయనే ధీమాలో బీజేపీ ఉంది.

Tags

Read MoreRead Less
Next Story