Mamatha Benerjee: దీదీ ప్రభుత్వానికి సుప్రీంలో షాక్

బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో కేంద్ర బలగాల మోహరింపు అంశంలో మమతా బెనర్జీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో గట్టి షాక్ తగిలింది. బెంగాల్‌లో కేంద్ర బలగాలను మోహరించాలన్న హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సమర్థించింది. ఎన్నికలను నిర్వహించడమంటే హింసకు లైసెన్స్ ఇవ్వడం కాదని వ్యాఖ్యానించింది. అదే సమయంలో ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించడం రాష్ట్ర ఎన్నికల కమిషన్ విధి అని హితవు పలికింది. హింస జరిగిన నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల్లో కేంద్ర బలగాలను మోహరించాలని కలకత్తా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ సంయుక్తంగా ఈ తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేశాయి. హైకోర్టు తీర్పును సమర్థించిన సర్వోన్నత న్యాయస్థానం.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీరును తప్పుబట్టింది.
పంచాయతీ ఎన్నికల నామినేషన్ సమయంలో హింస తలెత్తింది. జూన్ 9న పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసే సందర్భంగా పలు జిల్లాల్లో అల్లర్లు చెలరేగాయి. అల్లరి మూకలు బాంబులు విసిరారు. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందారు. దీంతో ప్రతిపక్ష పార్టీలు బీజేపీ, సీపీఎం మమత పార్టీపై విమర్శలు గుప్పించాయి. ఇక జూలై 8న బెంగాల్ లో పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి. 75వేలకు పైగా స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. 61 వేల పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేస్తున్నారు. జూలై 11న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర బలగాల మోహరింపు నేపథ్యంలో మమత ప్రభుత్వానికి షాక్ తగిలింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com