INDIA Alliance: ఇండియా కూటమికి బీటలు!

INDIA Alliance: ఇండియా కూటమికి బీటలు!
మమత ప్రకటనతో ప్రకంపనలు

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ చేసిన ప్రకటన విపక్ష ఇండియా కూటమిలో గందరగోళాన్ని సృష్టించింది. ఇండియా కూటమికి మమతానే మూల స్తంభమని ఆమె లేకపోతే కూటమే లేదని కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. మమతాపై తమకు గౌరవం ఉంటుందని కూటమి కొనసాగుతుందన్న నమ్మకం ఉందని NCP తెలిపింది. స్వార్థపూరిత, అవకాశవాద కూటమిలో ఇలాంటి పరిణామాలు ఊహించినవేనని భాజపా ఎద్దేవా చేసింది.

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ..పశ్చిమ బంగాల్‌లో ఒంటరిగానే పోటీ చేస్తున్నట్లు తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ చేసిన ప్రకటన విపక్ష ఇండియా కూటమిలో ప్రకంపనలు రేపింది. ఎన్నికల ఫలితాల తర్వాతే పాన్ ఇండియా కూటమి గురించి ఆలోచిస్తామని మమతా చెప్పడంపై కాంగ్రెస్‌ స్పందించింది. మమతా బెనర్జీ లేకుండా ప్రతిపక్ష ఇండియా కూటమి ఉనికిని ఎవరూ ఊహించలేరని హస్తం పార్టీ వెల్లడించింది.విపక్ష ఇండియా కూటమిలో మమతా బెనర్జీనే మూల స్తంభమని ఆమె లేని కూటమిని ఊహించలేమని కాంగ్రెస్‌ తెలిపింది.

మమతా బెనర్జీ ఇంకా విపక్ష ఇండియా కూటమిలోనే ఉన్నట్లు భావిస్తున్నామని NCP శరద్‌ పవార్‌ వర్గం వెల్లడించింది. మమతా బెనర్జీ ప్రతిపక్ష కూటమిలో.. కీలక భాగస్వామని ఆమె చేసిన ప్రకటన ఎన్నికల వ్యూహంలో భాగం కావచ్చని తెలిపింది. మమతా బెనర్జీపై తమకు అపారమైన గౌరవం ఉందని NCP కార్యనిర్వహక అధ్యక్షురాలు సుప్రియా సూలే వెల్లడించారు. ఇండియా కూటమి ఐక్యంగా ఉందని... మేమందరం కలిసే పోరాడతామని స్పష్టం చేశారు. కూటమిలో అంతర్గత పోరు లేదని తేల్చి చెప్పిన సుప్రియో సూలే.. రాష్ట్రాల్లో పరిస్థితులు భిన్నంగా ఉంటాయని తెలిపారు. తాము ఇంకా చర్చలు జరుపుతున్నామని వెల్లడించారు. విపక్ష ఇండియా కూటమిలో ఎలాంటి సమస్య లేదన్న NCP నేత క్యాస్ట్రో... భాజపాకు వ్యతిరేకంగా గట్టిగా పోరాడుతామని స్పష్టం చేశారు.

మమతా బెనర్జీ ప్రకటనపై భారతీయ జనతా పార్టీ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. స్వార్థ పూరిత,అవకాశవాద కూటమిలో ఇలాంటివే జరుగుతాయని కమలం పార్టీ విమర్శించింది.కీలకమైన నేతలు లేకుండా అసలు కూటమేంటని నిలదీసింది.ప్రతిపక్ష ఇండియా కూటమి విచ్చినమైపోయిందని మమతా బెనర్జీ, నీతీష్ కుమార్ అఖిలేష్ వంటి నాయకులు లేకుండా అసలు కూటమేంటని కర్ణాటక భాజపా నేత బసవరాజ్‌ బొమ్మై విమర్శించారు.

Tags

Read MoreRead Less
Next Story