Grenade Attack: అమృత్‌సర్ ఆలయంపై గ్రెనేడ్ దాడి.. నిందితుడు హతం

అమృత్‌సర్ లోని ఓ ఆలయంపై ఇటీవలే జరిగిన గ్రెనేడ్ దాడి ఘటనలో ప్రధాన నిందితుడు సోమవారం మృతి చెందాడు. గుర్సిదక్ సింగ్ అనే అనుమానితుడు పంజాబ్ పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. మరో నిందితుడు తప్పించుకున్నాడు.
అమృత్‌సర్‌లోని ఓ గుడిపై గ్రెనేడ్ దాడి జరిగిన విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి హ్యాండ్ గ్రెనేడ్ విసిరినట్లు తెలిసింది. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. పేలుడు వల్ల ఆలయ గోడ స్వల్పంగా ధ్వంసమైంది. అర్థరాత్రి గ్రెనేడ్ దాడి జరిగినట్లు సీసీటీవీ ఫూటేజ్ ద్వారా నిర్ధరించిన పోలీసులు.. నిందితుల కోసం తీవ్రంగా గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో నిందితులు రాజసాన్సీ ప్రాంతంలో తిరుగుతున్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో సీఐఏ, ఛెహర్తా పోలీసులతో కూడిన బృందం ఆ ప్రాంతంలో వారి కోసం గాలింపు చేపట్టింది.
ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున ఇద్దరు నిందితులు గుర్సిదక్ సింగ్, విశాల్ పోలీసులకు ఎదురుపడ్డారు. వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. నిందితులు తమ వాహనాన్ని వదిలేసి పోలీసులపై కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఒక బుల్లెట్ హెడ్ కానిస్టేబుల్ గురుప్రీత్ సింగ్ ఎడమ చేతికి తగలగా.. మరో బుల్లెట్ ఇన్‌స్పెక్టర్ అమోలక్ సింగ్‌ను తాకింది. ఈ క్రమంలో ఆత్మరక్షణ కోసం ఇన్‌స్పెక్టర్ వినోద్ కుమార్ ఎదురు కాల్పులు జరపడంతో గుర్సిదక్‌కు గాయాలయ్యాయి. గాయపడిన అధికారులు, నిందితుడిని సివిల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నిందితుడు ప్రాణాలు కోల్పోయాడు. అతని సహచరుడు విశాల్ మాత్రం పరారైనట్లు పోలీసులు తెలిపారు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com