Shahrukh Khan: షారూఖ్‌ఖాన్‌ను చంపేస్తానని బెదిరించిన లాయర్ అరెస్ట్

బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్‌ను చంపేస్తానని బెదిరింపులకు పాల్పడిన ఛత్తీస్‌గఢ్ న్యాయవాదిని ముంబై పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసిన ఫైజాన్ ఖాన్‌ను రాయ్‌పూర్ నివాసం నుండి అరెస్టు చేశారు. బాంద్రా పోలీసులకు వాంగ్మూలం ఇచ్చేందుకు నవంబర్ 14న ముంబై వస్తానని ఫైజాన్ ఖాన్ గతంలో చెప్పాడు. అయితే, గత రెండు రోజులుగా తనకు చాలా బెదిరింపులు వస్తున్నందున, అతను ముంబై పోలీసు కమిషనర్‌కు లేఖ రాశాడు. తన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయాలని అభ్యర్థించాడు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుండి సల్మాన్ ఖాన్‌కు వరుసగా బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో షారూఖ్ ఖాన్‌కు ఈ బెదిరింపు వచ్చింది.
షారూఖ్ తనకు రూ.50 లక్షలు ఇవ్వకుంటే చంపేస్తానంటూ గతవారం బాంద్రా పోలీస్ స్టేషన్‌కు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో పోలీసులు దోపిడీ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫైజాన్‌ఖాన్ పేరుతో రిజస్టర్ అయిన ఫోన్ నంబర్ నుంచి బెదిరింపు కాల్ వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో ముంబై పోలీసు బృందం రాయ్‌పూర్ వెళ్లి ఫైజాన్‌కు సమన్లు ఇచ్చింది. అయితే, ఆ బెదిరింపు కాల్‌కు, తనకు సంబంధం లేదని, ఈ నెల 2నే తాను ఫోన్ పోగొట్టుకున్నానని, ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు కూడా చేసినట్టు తెలిపారు.
తన నంబర్ నుంచి బెదిరింపు కాల్ చేయడం వెనక కుట్ర దాగి ఉందని అనుమానం వ్యక్తం చేశారు. అంతేకాదు, రెండు వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచేందుకు కారణమయ్యారంటూ షారూఖ్‌పై బాంద్రా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. షారూఖ్‌కు బెదిరింపుల కేసులో తనను ఇరికించారని ఆరోపించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com