Karnataka: రూ. 10 వేల కోసం నీరు కలపకుండా 5 బాటిళ్ల మద్యం తాగి యువకుడి మృతి

నలుగురు ఫ్రెండ్స్ ఒక్కదగ్గరికి చేరారంటే సందడి మామూలుగా ఉండదు. ఒకరిపై ఒకరు జోక్స్ వేస్తూ, ఆటపట్టిస్తూ తెగ ఎంజాయ్ చేస్తుంటారు. కొన్ని సార్లు పందాలు కాస్తుంటారు. ఇంత ఫుడ్ తినాలని, ఇంత మద్యం తాగితే డబ్బులిస్తామని పందెం కాస్తుంటారు. అయితే సరదాగా చేసే ఈ పనులు ఒక్కోసారి ప్రాణాల మీదికి తెస్తాయి. ఇదే విధంగా ఓ యువకుడు స్నేహితులతో పందెం కాసి నీళ్లు కలపకుండా 5 బాటిళ్ల మద్యం తాగి మృతి చెందాడు.
కర్ణాటకలో 21 ఏళ్ల కార్తీక్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి రూ.10,000 పందెం కోసం ఐదు సీసాల మద్యం తాగి మరణించాడు. కార్తీక్ తన స్నేహితులు వెంకట రెడ్డి, సుబ్రమణి, మరో ముగ్గురికి ఐదు ఫుల్ బాటిళ్ల మద్యం తాగుతానని చెప్పాడు. అలా తాగితే రూ.10,000 ఇస్తానని వెంకట రెడ్డి కార్తీక్‌తో చెప్పాడు. దీంతో కార్తీక్ ఐదు ఫుల్ బాటిల్స్ తాగాడు. కానీ కొద్దిసేపటికే తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. వెంటనే కార్తీక్ స్నేహితులు సమీప ఆసుపత్రికి తరలించారు.
కోలార్ జిల్లాలోని ముల్బాగల్‌లోని ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ అతను మరణించాడు. కార్తీక్‌కు వివాహం జరిగి సంవత్సరం అయింది. అతని భార్య ఎనిమిది రోజుల క్రితమే ఒక బిడ్డకు జన్మనిచ్చింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వెంకట రెడ్డి, సుబ్రమణి సహా ఆరుగురు వ్యక్తులపై నంగలి పోలీస్ స్టేషన్‌లో పోలీసు కేసు నమోదైంది. ఇద్దరినీ అరెస్టు చేశారు. పోలీసులు మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com